బ్లాక్​ మార్కెట్‌లోకి ‘సర్కార్’​ సిరంజీలు!

by  |
బ్లాక్​ మార్కెట్‌లోకి ‘సర్కార్’​ సిరంజీలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్​ సిరంజీలు బ్లాక్​ మార్కెట్​కు తరలి వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్​ వేసేందుకు సూదుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ వ్యాక్సిన్​ సెంటర్లలో సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్​ అందిస్తామని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. తమకు సిరంజీల కొరత ఉందని, టీకా పొందాలంటే స్వతహాగా సూదులు తెచ్చుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో సిరంజీలు తెచ్చుకోవడమేమిటని ప్రశ్నించిన వారికి డోసులు ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ప్రైవేట్​ మెడికల్​ షాపుల నుంచి సూదులు, సిరంజీలు కొనుగోలు చేసుకొని తీసుకువెళ్లాల్సి వస్తుంది.

పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్​ హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండటం విస్తుపోయే అంశం. ఇటీవల కాలంలో 104 ఫిర్యాదుల కాల్​ సెంటర్​ కు ఇలాంటి కంప్లైట్స్​ కూడా వస్తున్నట్లు వైద్యారోగ్యశాఖలోని ఓ అధికారి ఆఫ్​ ది రికార్డులో తెలిపారు. మేడ్చల్​ జిల్లా మచ్చబొల్లారం పీహెచ్​సీలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటన జరిగింది. సూదులు తెచ్చుకున్న వారికే డోసులు ఇచ్చారు.

ఎటు పోతున్నాయ్​.?

రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా సర్కార్​ కేంద్రాల్లో వ్యాక్సిన్​ పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని కేంద్రాల్లో టీకాలు పొందాలంటే స్వతహాగా సిరంజీలు కొనుక్కోని వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితి అధికంగా ఉంది. వాస్తవంగా ప్రతీరోజు వైద్యారోగ్యశాఖ కోల్డ్​ స్టోరేజ్​ల నుంచి ఒక్కో పీహెచ్‌సీకు 200 డోసులతో పాటు సిరంజీలను టీఎస్​ఎంఎస్​ఐడీసీ(తెలంగాణ స్టేట్​ మెడికల్​ సర్వీసెస్​ ఇన్​ ఫ్రాస్టక్చర్ డెవలప్​ మెంట్​ కార్పోరేషన్​) సప్లై చేస్తుంది. అర్హులు ఎక్కువున్న చోట 500 నుంచి 800 డోసులను కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వీటికి అనుసంధానంగా సిరంజీలూ పంపిణీ చేస్తున్నారు. ప్రతీ వారం స్టాక్​ కూడా పరిశీలిస్తున్నట్లు టీఎస్​ఎంఎస్​ఐడీసీ పేర్కొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాక్సిన్​ కేంద్రాల్లో టీకాలతో పాటు సిరంజీలనూ పూర్తిస్థాయిలో నిల్వ ఉంచామని స్పష్టం చేసింది. అయితే ఆయా కేంద్రాల్లో సిరంజీల కొరత ఎందుకు వస్తుందనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెడికల్​ ఆఫీసర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది కలసి అమ్ముకుంటున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.


Next Story

Most Viewed