ఆర్టీసీ బస్సులు బ్రేక్​డౌన్.. కొత్తవి కొనక ఏడేండ్లు

by  |
Cm KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రగతిరథ చక్రాలు ఆగిపోతున్నాయి. ఆర్టీసీలో ఒకేసారి 1300 బస్సులకు మూలనపడ్డాయి. ఏండ్ల కిందటే గడువు మీరిన ఈ బస్సులను ఇప్పటి వరకూ నడిపించుకుంటూ వస్తున్న ఆర్టీసీ అధికారులు… ఇప్పుడు మరింత మొరాయిస్తుండటంతో వాటిని పక్కన పడేశారు. కొన్ని బస్సులను తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి, ఇతర బస్సుల విడిభాగాలతో నడిపించే ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్​జిల్లా పరిధిలో రెండు సంఘటనలు ఇదే తరహా బస్సులతో ప్రమాదం జరిగింది. తొర్రూర్​పరిధిలో ఓ బస్సు చక్రాలు ఊడిపోగా.. రఘునాథపల్లిలో మరో బస్సు దగ్ధమైంది. దీంతో పాత బస్సులను నడిపేందుకు అధికారులు జంకుతున్నారు.

రూట్లను తగ్గించారు

గ్రేటర్​ ఆర్టీసీతో పాటుగా పల్లె వెలుగు బస్సులను దాదాపుగా తగ్గిస్తున్నారు. గతంలో గ్రామాలకు వెళ్లిన బస్సులను కరోనా సెకండ్​ వేవ్ లాక్​డౌన్ ​తర్వాత పునరుద్ధరించడం లేదు. ప్రధాన పట్టణాలకు వెళ్లే వాటిని కూడా బ్రేక్ ​వేస్తున్నారు. ఇప్పటికే కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వజ్ర బస్సులను మూలకేయగా… కొన్ని లగ్జరీ బస్సులను కూడా బయటకు తీయడం లేదు. ఇక గ్రేటర్ ​పరిధిలోని శివారు రూట్లకు దాదాపుగా బస్సులను బంద్​ చేశారు. కేవలం ప్రధాన ప్రాంతాలకు తిరిగే వాటినే తిప్పుతున్నారు.

బస్సుల్లేవ్

2019లో సమ్మెకు ముందు 10,460 బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 781 బస్సులను అధికారికంగా స్క్రాప్​గా వేశారు. ప్రస్తుతం అధికారులు చెప్పుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 రీజియన్ల పరిధిలోని 9,679 బస్సులు నడుపుతున్నారు. వీటిలో ఆర్టీసీకి సొంతంగా 6,370 బస్సులున్నాయి. వీటిలో 180 బస్సులను కార్గో సర్వీసులుగా మార్చారు. వీటిలో గత ఏడాది వరకే గ్రేటర్​తో పాటుగా రాష్ట్రం మొత్తంగా 1310 బస్సులు గడువు తీరిపోయాయి. అయినప్పటికీ వీటిని నడుపుతున్నారు. ఒక బస్సు ఆగిపోతే దానికి సంబంధించిన విడిభాగాలను వినియోగించుకుంటూ తిప్పుతున్నారు. దీంతో ప్రతిరోజూ బస్సులకు మరమ్మత్తులు చేయాల్సి వస్తోంది. అయినప్పటికీ కొత్త బస్సులను కొనేందుకు ఆర్టీసీ దగ్గర రూపాయి లేకుండా పోయింది. ప్రతినెలా వేతనాల కోసమే అష్టకష్టాలు పడుతున్న ఆర్టీసీ… నెలలో 15వ తేదీ తర్వాత జీతాలు చెల్లిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయడం లేదు. ప్రధానంగా పల్లె వెలుగు, గ్రేటర్​ పరిధిలోని ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని పలుమార్లు నివేదికలు సమర్పించింది. కానీ ఒక్కటి కొనలేదు. కాగా వజ్ర, సూపర్​ లగ్జరీ, ఎలక్ట్రిక్​ బస్సులు, ఏసీ బస్సులను కలుపుకుని 600 కొత్తవి కొనుగోలు చేసినట్లు అధికారులు చెప్పుతున్నా… వాటిలో వజ్ర బస్సులను మూలకేశారు. కొన్ని ఏసీ బస్సులను ఎటు నడుపాలో తెలియక డిపోలకే పరిమితం చేశారు. దీంతో అవి ఇప్పుడు స్టార్ట్​ కావడం లేదు.

1310 బస్సులు కావాల్సిందే

గ్రేటర్ ఆర్టీసీ పరిధిలో దాదాపు 840 బస్సులు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే 470 బస్సులు పనికిరాకుండా ఉన్నాయి. వీటిని బయటకు తీస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వీటి గడువు మీరి చాలా నెలలు దాటుతోంది. గడువు మీరినా ఎలాగో నెట్టకువస్తున్నారు. కానీ ఇప్పుడు వాటితో ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇటీవల తొర్రూర్​లో ఓ బస్సు చక్రాలు ఊడిపోయాయి. గ్రేటర్ ​ఆర్టీసీ పరిధిలోని ఓ డిపోలో విడిభాగాలు మార్చి, మరమ్మత్తులు చేసి బయటకు తీసిన ఆర్డినరీ బస్సు ముందుకు వెళ్లేందుకు గేర్​ వేస్తే… రివర్స్​ వెళ్లి లగ్జరీ బస్సును డిపోలోనే ఢీకొట్టింది. దీంతో ఈ పాత బస్సులను బయటకు తీయాలంటే వణుకుతున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని 1310 ఆర్టీసీ బస్సులను మూలకేశారు. కొత్తగా కనీసం 1300 బస్సులు కావాలని ప్రభుత్వానికి విన్నవించారు. మరోవైపు బస్సులు లేకపోవడంతో రవాణా తగ్గించారు. గ్రేటర్​ పరిధిలోని శివారు ప్రాంతాలకు దాదాపుగా ఆపేశారు. అటు గ్రామాలకు వెళ్లే పల్లె వెలుగు, ఇతర ఆర్డినరీ బస్సులు కూడా ఆగిపోయాయి. కొత్త బస్సులు కొనుగోలు చేస్తేనే రవాణా పునరుద్దరిస్తామని అధికారులు చెప్పుతున్నారు.

అధికారులకు కొండగట్టు భయం

2018లో 102 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టు వద్ద బ్రేకులు ఫెయిలై దొర్లిపడిపోయి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. అది ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపటంతో.. ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. అసలు బస్సులు లేకపోవడంతో రవాణా తగ్గించడంతో కొన్ని బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణీకులు ఎక్కుతున్నారు. దీంతో అధికారులకు భయం పట్టుకుంటోంది. కానీ ఏం చేయలేని పరిస్థితి అంటూ చేతులెత్తేస్తున్నారు. అయితే ప్రస్తుతం బస్సుల కొరత తీవ్రంగా ఉందని, అద్దె బస్సులను తిప్పాలంటే కూడా బకాయిలు ఉండటంతో సరిగా రావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేమంటూ అధికారులు బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కుతున్నారు.


Next Story