సూర్యాపేటలో ‘గోల్డెన్ ఏజెన్సీ’ గోల్‌మాల్.. 250 మంది కస్టమర్లకు టోకరా..

by  |
సూర్యాపేటలో ‘గోల్డెన్ ఏజెన్సీ’ గోల్‌మాల్.. 250 మంది కస్టమర్లకు టోకరా..
X

దిశ సూర్యా పేట : తక్కువ ధరలకు ఫర్నీచర్‌ ఇస్తామంటూ వినియోగదారులను నిలువునా ముంచిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో తక్కువ ధరలకు ఫర్నిచర్ ఇస్తామంటూ సుమారు 25 రోజుల క్రితం గోల్డెన్ ఏజెన్సీ పేరుతో తమిళనాడుకు చెందిన అయ్యప్పన్ అనే వ్యక్తి షాప్ ప్రారంభించారు. షాపులో కొన్ని పేరున్న కంపెనీల బెడ్స్, సోఫాలు, మాట్రిస్, కుర్చీలు, బల్లాలతో పాటు అనేక రకాల హోం ఫర్నిచర్ ఉంచి భారీ ఎత్తున బ్రోచర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం చేశారు. తక్కువ ధరలకు ఇస్తామని నమ్మబలికి డబ్బులు చెల్లించిన 12 రోజులకు వస్తువులు ఇస్తామని చెప్పారు. ఒక్కొక్కరు రూ.20 నుంచి రూ.30 వేల వరకు చెల్లించారు. అయితే, మొదట్లో 12 రోజులు పూర్తయిన వారికి ఫర్నిచర్ అందజేయడంతో తర్వాత ఆశతో చాలా మంది స్కీంలో చేరారు. ఇలా దాదాపు 250 మంది వరకు డబ్బులు కట్టగా రెండు రోజులుగా షాప్ తాళాలు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీస్తే నిర్వాహకులు డబ్బులతో ఉడాయించినట్లు తేలింది. దీంతో బుధవారం బాధితులు షాప్‌ వద్దకు చేరుకొని షాప్‌లో అందిన కాడికి దోచుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి షట్టర్లు క్లోస్ చేసి తాళాలు వేశారు. సుమారు 250 మంది దగ్గర ఆర్డర్ రూపంలో రూ.90 లక్షలతో నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుస్తున్నది. నిర్వాహకులకు తెలుగు రాదని వారు తమిళంలో మాట్లాడారని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

90 వేలు కట్టాను..

మేము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. జీవితాన్ని ఈదుకుంటూ రూపాయి రూపాయి వెనుకేసుకుంటూ దాచుకున్న డబ్బులు ఫర్నిచర్ కోసం ఇందులో కట్టాము. 26 తారీఖున డెలివరీ చేస్తానని డబ్బులు కట్టించుకుంటారు. తీరా చూస్తే ఆఫీసుకు తాళం వేసి ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయగలరు..

-సోమగాని సారిక, సూర్యాపేట

50వేలు కట్టాను..

నేను టైలరింగ్ చేస్తాను. రోజు వారీ డబ్బులను చిట్టీలు వేసుకుని ఈనెల లోనే ఎత్తుకున్నాను. మా పాప పెళ్లి కోసం ఆ ఫర్నిచర్ అవసరం ఉంటుందని డబ్బులు తెచ్చి ఇందులో ఐదు రోజుల క్రితం కట్టాను. నేను కట్టేది కాకా మా తమ్ముడితో కూడా కట్టించాను. తీరా చూస్తే తాళం వేసి ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.

-సైదులు అర్వపల్లి మండలం కొమ్మల


Next Story

Most Viewed