రిలయన్స్ లాభాలు పెరిగి, ఆదాయం తగ్గింది!

by  |
రిలయన్స్ లాభాలు పెరిగి, ఆదాయం తగ్గింది!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ. 13,101 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 11,640 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు మొత్తం కంపెనీ ఆదాయం 22 శాతం క్షీణించి రూ. 1,28,450 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 1,60,447 కోట్ల ఆదాయాన్ని వెల్లడించింది. ఆర్థిక ఫలితాలపై స్పందించిన ముఖేష్ అంబానీ..భారత ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రిలయన్స్ తన సహకారాన్ని అందించింది. మూడో త్రైమాసికంలో కమెప్నీ అద్భుతమైన పనితీరుని కనబరిచింది. అన్ని విభాగలతో పాటు రిటైల్ విభాగాల్లోనూ బలమైన పునరుజ్జీవనం సహా డిజిటల్ సేవల్లో స్థిరమైన వృద్ధిని సాధించాం. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు రిలయన్స్ 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించినందుకు గర్వంగా ఉందని’ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 2.45 శాతం క్షీణించి రూ. 2,047 వద్ద ట్రేడయింది.

జియో లాభం రూ. రూ. 3,489 కోట్లు..

రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ డిసెంబర్ త్రైమాసికంలో రూ. 3,489 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది నమోదైన రూ. 3,020 కోట్లతో పోలిస్తే 15.5 శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 5.3 శాతం పెరిగి రూ. 19,475 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో జియో సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) రూ. 151కి పెరిగింది. అదేవిధంగా జియో చందాదారుల సంఖ్య 52 లక్షలు పెరగడంతో మొత్తం 41.08 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed