రేవంత్‌ పిటిషన్‌ కొట్టేయడం కుదరదు: సుప్రీం

7

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు సంబంధించి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత ఉన్నదో లేదో ధర్మాసనం తేలుస్తుందని, దాన్ని ఇప్పుడు డిస్పోజ్ చేయడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ముందుకు గురువారం విచారణకు రాగా సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని రేవంత్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు. పర్యావరణ అనుమతులు లేకుండానే సచివాలయ భవనాలను కూల్చేసే పనులను అర్ధరాత్రి మొదలుపెట్టారని వివరించారు. కొత్త సచివాలయం కోసమే పాత భవనాల కూల్చివేతను చేపట్టినందున పర్యావరణ అనుమతులు తప్పనిసరి అవసరం అని స్పష్టం చేశారు.

చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని సచివాలయం నిర్మాణాల కూల్చివేత పనులు పూర్తయినట్లేనా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఏముందని ప్రశ్నించారు. న్యాయవాది శ్రావణ్ కుమార్ స్పందిస్తూ, సచివాలయం కూల్చివేత అనేది కొత్త సచివాలయం భవనాలను నిర్మించడం కోసమా లేక సన్నద్ధం కావడంలో భాగమా అనేది తేల్చాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జోక్యం చేసుకుని, తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసుకోవచ్చునంటూ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటికే తీర్పు ఇచ్చిందని, అందువల్ల ఇప్పుడు విచారిస్తున్న రేవంత్ రెడ్డి పిటిషన్‌పై మళ్ళీ విచారణ జరపాల్సిన అవసరం లేదని, అందువల్ల తిరస్కరించాలని కోరారు.

జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జోక్యం చేసుకుని, సచివాలయం అంశంపై గతంలో జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్ విచారణ జరపినందున ఇప్పుడు ఆ పిటిషన్‌ను మళ్ళీ అదే బెంచ్‌కు బదిలీ చేస్తామని అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనను తుషార్‌ మెహతా వ్యతిరేకించారు. కేసు విచారణ యోగ్యమైనది కానందున బదిలీ అవసరంలేదని వాదించారు. దీనితో ఏకీభవించని త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ అశోక్ భూషణ్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 26కు వాయిదా వేసింది.