క్షేత్రస్థాయి ‘సర్వే’ ఉత్తదే..

by  |
క్షేత్రస్థాయి ‘సర్వే’ ఉత్తదే..
X

ఆస్తుల లెక్కలు పక్కాగా చేపట్టాలని, ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ఒకేచోట కూర్చొని వివరాలు సేకరిస్తున్నారు. మరికొన్ని చోట్ల గ్రామ పంచాయతీల్లోని రికార్డుల ఆధారంగా ఆన్​లైన్​ చేస్తున్నారు. కేవలం కొత్త జీపీల్లోనే ఇంటింటికీ వెళ్లి అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఆస్తుల వివరాలు, వ్యవసాయేతర భూములు వివరాలు సేకరిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి, ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే వారం రోజుల నుంచి జిల్లాలో ఆస్తుల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించాల్సిన అధికారుల పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. రికార్డుల్లో ఉన్న ఆస్తుల వివరాలనే ఆన్​లైన్​లో నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతున్నది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో తప్ప, పాత జీపీల్లో సర్వే జరగడం లేదని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సర్వే నిర్వహణపై ‘దిశ’ ప్రతినిధి రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం మండల్లాలో సందర్శించిన సందర్భంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో సర్వేపై ఆరా తీయగా.. ప్రచారం కోసం మాత్రమే తాత్కాలిక సర్వేలు నిర్వహిస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం సర్వే ప్రారంభం కాగా.. 1వ వార్డులో ఒక పది ఇళ్లను మాత్రమే సర్వే చేశారని, మిగతా ఇళ్ల వివరాలను గ్రామ పంచాయతీలో రివిజన్ రికార్డు ఆధారంగానే ఆన్​లైన్ చేస్తున్నట్లు ఆరోపించారు. తుమ్మలూర గ్రామంలో మొత్తం 900 ఇళ్లు ఉన్నట్లు స్థానిక పంచాయతీ కార్యదర్శి వివరించారు. ఈ ఇళ్ల సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఆదివారం ఈ గ్రామంలో సర్వే నిర్వహించలేదని చెప్పారు.

కందుకూరు మండలం ధన్నారం గ్రామంలో సుమారుగా 100 వరకు ఇళ్లు ఉండవచ్చనని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఒకే చోట కూర్చొని ఆస్తుల వివరాలు తీసుకున్నట్లు ప్రజలు తెలిపారు. అయితే భూ వివరాలతోపాటు పశుసంపద, షెడ్లు తదితర వివరాలను సేకరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వివరాల సేకరణతో మొదలైన భయం..

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వ్యవసాయ, వ్యవసాయేతర వివరాలతో పాటు పొలంలో వేసుకున్న షెడ్లు, పశు సంపద, కోళ్ల ఫారాల వివరాలు సైతం తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఓటర్ కార్డు, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, వ్యవసాయ భూమి పాసు బుక్ జిరాక్స్ లు తీసుకుంటున్నారు.

పన్నులు వేస్తారా..?

నాకు కోళ్ల ఫారం ఉంది. ప్రభుత్వం దగ్గర భూముల వివరాలు ఎలాగు ఉంటాయి. కోళ్ల ఫారంను బ్యాంక్ లోన్ తీసి నిర్మించాం. మళ్లీ సర్వేలు ఎందుకని. ఉన్న పొలంలో కోళ్ల ఫారం వేసుకొని కుటుంబ సభ్యులందరం పని చేసుకుంటున్నాం. ప్రభుత్వం సర్వే నిర్వహించడం బాగానే ఉన్న, రైతుల గేదెల,కోళ్ల ఫారం షెడ్ల పైన పన్నులు విధిస్తే తట్టుకోలేం. బ్యాంక్ బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నాం. అన్ని తెలిసి ప్రభుత్వం ఇలాంటి ఆలోచన సరైంది కాదు.
కొండం యాదయ్య, దన్నారం గ్రామం

గడవులోపు పూర్తి చేస్తాం

ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ప్రజల ఆస్తుల వివరాలు సేకరిస్తాం. మహేశ్వరం మండలంలోని తుమ్మలూర్ గ్రామంలో ఇప్పటి వరకు 30 ఇళ్లు సర్వే చేశాం. ప్రతి ఇల్లు తో పాటు గ్రామానికి అనుకోని ఉన్న వ్యవసాయ పొలంలోని వివరాలు మాత్రమే సేకరిస్తున్నాం.

-‌‌నరేందర్, కార్యదర్శి

Next Story

Most Viewed