రిటైల్ రంగంలో ఉద్యోగాల గండం!

by  |
రిటైల్ రంగంలో ఉద్యోగాల గండం!
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ రేటు 23 శాతానికి చేరుకుందని ఇటీవల ఓ సర్వే తెలిపింది. దేశీయంగా మాంద్యం పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి తోడు తాజాగా కొవిడ్-19 మరింత భయపెడుతోంది. కరోనా వైరస్ ధాటికి దేశంలో అన్ని మూలలా లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని బట్టి లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారు అనే విషయంపై స్పష్టత లేదు. ఇటువంటి పరిస్థితిలో దేశంలో ఉద్యోగాలపై నమ్మకాలు సడలిపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల వ్యాపారాలు నిలిచిపోవడంతో రిటైలర్లు సుమారు 80,000 మంది ఉద్యోగాలు తొలిగిపోయే ప్రమాదముందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక చెబుతోంది. ఆ నివేదికలో సుమారు 750కి పైగా రిటైలర్ల అభిప్రాయాలను వెల్లడించారు. వీటిలో దాదాలు 3.92 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా చిన్న చిన్న రిటైలర్లు తమ సిబ్బందిలో 30 శాతం మందిని తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు వారు చెప్పారు. ఈ నివేదిక ప్రకారం చేసిన సర్వే కేవలం రిటైల్ రంగంలోని ఉద్యోగుల గురించి మాత్రమే పరిమితం. ఈ రంగం కాకుండా చిన్నపాటి వర్తకులు నిర్వహించే స్వయం ఉపాధి ఉన్న వారిని కూడా లెక్కగడితే లక్షల్లో ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే అవకాశముంది.

నివేదిక వివరించినట్టు..వంద వరకూ ఉద్యోగులున్న కంపెనీలను చిన్న రిటైలర్లుగానూ, వంద నుంచి వెయ్యి వరకూ సిబ్బంది ఉన్న వాటిని మధ్యస్థాయిగానూ, వెయ్యికి మించి ఉద్యోగులున్న కంపెనీలను పెద్ద రిటైలర్లుగా పర్గణలోకి తీసుకోవడం జరిగింది. సర్వేలో చిన్న స్థాయి సంస్థలు 65 శాతం ఉండగా, మధ్య స్థాయి సంస్థలు 24 శాతం, భారీ స్థాయి సంస్థలు 11 శాతం పాల్గొన్నాయి. కొవిడ్-19 ప్రభావంతో తమ వ్యాపారాల్లో ఆదాయం కోల్పోతామని, ఇది మానవ వనరులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని వారు చెబుతున్నారు.

వారి అభిప్రాయం ప్రకారం మధ్య స్థాయి రిటైలర్లు వారి సిబ్బందిలో 12 శాతాన్ని, పెద్ద రిటైల్ సంస్థలు 5 శాతం వరకూ సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టం చేశాయి. మొత్తం మీద రిటైల్ రంగంలో అన్ని విభాగాల్లోనూ కలిపి 20 శాతం వరకూ సిబ్బిందిని తగ్గించే యోచన చేస్తున్నాయి. అలాగే, లాక్‌డౌన్, కరోనా కారణంగా మళ్లీ తమ ఆదాయం నిలదొక్కుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందని 70 శాతం మంది రిటైలర్లు అభిప్రాయపడగా, 20 శాతం మంది సంవత్సరానికిపైగా సమయం పడుతుందని తెలిపారు.

ఇదే సమయంలో, లాక్‌డౌన్ కారణంగా ప్రకటించిన వెంటనే సుమారు 95 శాతం మంది ఆహారేతర రిటైలర్లు తమకు చెందిన వ్యాపరాలను, బ్రాంచ్‌లను పూర్తీగా మూసివేశారు. దీనివల్ల ఆదాయం ఒక్కసారిగా సున్నాగా మారింది. సంవత్సరం క్రితం ఆదాయంతో పోలిస్తే ఈసారి 40 శాతం ఆదాయం తగ్గిపోతుందని వారు అంచనా వేస్తున్నారు. ఆహారోత్పత్తులను అమ్మే రిటైలర్లు గత 6 నెనలతో పోలిస్తే 57 శాతం వరకూ తగ్గుతుందని రిటైలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యర్థిస్తోంది. ఇందులో భాగంగా..అద్దె, సిబ్బంది జీతాల కోసం సహాయం అందించాలని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అడుగుతోంది. ఒకవేళ ప్రభుత్వం సాయం ఇవ్వకపోతే తమ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించడం మినహా మరో మార్గం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న ఎక్కువమంది జీఎస్టీ తగ్గించాలని, వ్యాపారాలను కొనసాగించేందుకు రుణాలను ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా కనీసం రెండు నెలల పాటు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలంటూ అడుగుతున్నారు.

tags: Retail industry, coronavirus, covid-19, job loss in retail, employees


Next Story

Most Viewed