కరీంనగర్‌ జిల్లాలో 2 వేల ఏళ్ల నాటి గ్రామం.. తేల్చిన పరిశోధకుడు..!

by  |
karimnagar-historical
X

దిశ, హుజురాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు వేల ఏళ్ల చరిత్ర కలిగిన గ్రామం ఒకటి బయటపడింది. ఔత్సాహిక పురావస్తు చరిత్ర పరిశోధకుడు ఆర్.రత్నాకర్ రెడ్డి తన పరిశోధనలో భాగంగా హుజురాబాద్ రంగనాయకుల గుట్ట దిగువన ఈ గ్రామాన్ని కనుగొన్నట్టు తెలిపారు. ఇక్కడ రెగ్యులర్‌గా కనిపించే రోళ్లకు భిన్నంగా ఉన్న వెడల్పాటి రోళ్లు, దంచి, నూరడానికి ఉపయోగించిన రోకలి బండతో పాటు అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, ఇనుము ఉక్కు పరిశ్రమ, కుండల పరిశ్రమ, పెద్ద పెద్ద ఇటుకలు , వీరుల విగ్రహాలు, నాగ దేవతలు, భైరవ శిల్పం మొదలైన అనేక చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు రత్నాకర్ రెడ్డి వివరించారు.

ఆ గ్రామం ఎక్కడంటే..

కరీంనగర్ జిల్లా నుంచి 40 కిలోమీటర్లు, వరంగల్ జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గల హుజురాబాద్ పట్టణ శివారులోని రంగ నాయకుల గుట్ట పరిసర ప్రాంతాల్లో పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి నవీన శిలా యుగం నుండి మొదలు శాతవాహనులు.. ఆ తర్వాత కాలంలో చోటుచేసుకున్న అనేక చారిత్రక ఆధారాలకు సంబంధించిన గుర్తులను బయటపెట్టారు. రంగనాయకుల గుట్ట చుట్టూ పూర్వపు హుజురాబాద్ గ్రామం ఉందని, సుమారుగా 80 ఎకరాల పాటి మీద అని పిలిచే ఎత్తైన మట్టి దిబ్బ ఉందన్నారు. ఇంత విశాలమైన ‘పాటి గడ్డ’ చాలా అరుదని, ఈ ప్రదేశంలో పూర్వం ఇప్పుడు ఉన్నట్లే ఆనాడు కూడా అన్ని వృత్తుల వారితో కలిసి జీవించిన పెద్ద గ్రామం ఉండేదని తెలుస్తున్నదన్నారు. దీనినే స్థానికులు ‘ఏదులాపురం’ అని ప్రస్తుతం పిలుచుకుంటున్నట్టు చెప్పారు. ఇంత పెద్ద గ్రామానికి తాగు నీరు, సాగు నీరు అందించిన పల్లె ఏరు ప్రవాహం పాటి మీది నుండి ప్రవహిస్తుందని, సమీపంలో నాగుల చెరువు కూడా ఉందన్నారు.

ఆయుర్వేద వైద్యానికి రోళ్ల ఉపయోగం..

అనేక వృత్తులు వారు జీవించిన ఇంత పెద్ద గ్రామానికి వైద్యులు కూడా అవసరమే. అందుకే ఇక్కడ సాధారణంగా పరుపు బండలపై కనిపించే రోళ్ళకు భిన్నంగా వరుసగా మూడు రోళ్లు ఉన్నాయి. ఇవి లోతు తక్కువగా ఉండటంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయి. వీటిని బట్టి ఆయుర్వేద వైద్యం కోసం మందుల తయారీకి వీటిని ఉపయోగించి ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూరడానికి, దంచడానికి ఉపయోగించే రోకలి బండ ఒకటి పరిశోధకుడికి లభించగా.. ఇటువంటి రోళ్లను గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గుర్తించినట్టు ఆర్. రత్నాకర్ రెడ్డి తెలిపారు.

ఇనుము, ఉక్కు పరిశ్రమ..

పాటి మీద చిట్టెపు రాళ్ళు దండిగ ఉన్నాయి. ఇనుమును సంగ్రహించి మరియు పోత పోసేటప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలను చిట్టెపు రాళ్ళు అంటారు. ఈ ప్రాంతంలో రెండు వేల కిందటే ఇనుము ఉక్కు పరిశ్రమ ఉందని ఆయన పరిశోధనలో వెల్లడైందన్నారు.

కుండల పరిశ్రమ..

వ్యవసాయం సాగుచేసి పంటలు పండించడంతో పాటు పండిన ధాన్యం నిల్వ చేసిన పెద్ద పెద్ద కాగులు ఇక్కడ లభ్యమయ్యాయి. చక్రం మీద తయారు చేసి బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద రంగు, గోధుమ రంగు మట్టి పాత్రల ఆనవాళ్లు ఇక్కడ విస్తారంగా కనిపించాయి.

అలంకరణ పరిశ్రమ..

ఇక్కడ మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్ళు కనిపించాయి. పెద్ద రాతి యుగము నాటి నుండి మొదలు ప్రజలు అలంకార ప్రియులనీ తెలుస్తున్నది.

పెద్ద ఇటుకలు..

పాటి మీద బరువైన పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారు. పై కప్పుకు గూన పెంకులు ఉపయోగించారు. వీటితో పాటు తేలికైన ఇటుకలు కూడా దర్శనమిచ్చాయి.

వీరులు..

హనుమాన్ గుడి పక్కన గల పొలంలో ఓ వీరుడిని చెక్కిన విగ్రహం ఉంది. కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం.

భైరవ శిల్పం..

పాటి మీద పూర్వపు శిథిల దేవాలయం, హనుమాన్ గుడి ఉంది. గుట్ట వెనుక నుండి వెళ్లే తోవ పక్కన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పాన్ని చెక్కారు.

స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో పురావస్తు శాఖ గతంలో ఇక్కడ రెండు కుండలను స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ పాటిగడ్డ అనేక చారిత్రక ఆధారాలతో నిండియున్నది. పురావస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో చరిత్రాక విషయాలు బయటపడే అవకాశం ఉందని పరిశోధకుడు వెల్లడించారు.


Next Story

Most Viewed