రాష్ట్రంలో 30మంది ఐఏఎస్‌లకు స్థానచలనం

by  |
రాష్ట్రంలో 30మంది ఐఏఎస్‌లకు స్థానచలనం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడిలో నలువైపుల నుంచి విమర్శలు వస్తున్న సమయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిపై బదిలీ వేటు పడింది. ఆమెను అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సయ్యద్ ఆలీ మర్తజా రిజ్వీని నియమించారు. ప్రజారోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న యోగితా రాణాను ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆ స్థానంలో గతంలో ఈ శాఖకు కమిషనర్‌గా ఉన్న వాకాటి కరుణను నియమించారు. ఈ మార్పులతో పాటు మొత్తం 30 మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కలిగింది.

– దీర్ఘకాలిక శిక్షణ ముగించుకుని వచ్చిన జ్యూతి బుద్ధప్రకాశ్‌ అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులయ్యారు.
– రాణి కుముదిని కార్మిక శాఖ ప్రత్యేక సీఎస్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం అహ్మద్ నదీమ్ ఈ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
– అదర్ సిన్హా – పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధనా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు. ఈ బాధ్యతలను ఎఫ్ఏసీ హోదాలో నిర్వర్తిస్తున్న రజత్ సిన్హా తప్పుకున్నారు.
– ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దేవసేన ప్రాథమిక విద్య డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న చిత్రా రామచంద్రన్ పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గృహ నిర్మాణ శాఖకు పరిమితమయ్యారు.
– యువజన సర్వీసులు, టూరిజం, సంస్కృతి శాఖల కార్యదర్శిగా ఉన్న రఘునందన్‌రావు పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ పోస్టులో కేఎస్ శ్రీనివాసరాజు కార్యదర్శిగా నియమితులయ్యారు.
– నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చూస్తున్న యాస్మీన్ బాష తప్పుకోవడంతో పట్టణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ఎల్ షర్మన్ నియమితులయ్యారు.
– ఎస్సీ అభివృద్ధి విభాగం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ బొజ్జా ఆ బాధ్యతలను యోగితా రాణాకు అప్పగించారు. టి. విజయకుమార్ ఎస్సీ అభివృద్ధి విభాగం ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.
– పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉన్న షిక్తా పట్నాయక్ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడంతో ఆ స్థానంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హొలికేరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
– గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇ.శ్రీధర్ నియమితులయ్యారు

Next Story