'కీలక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు'

by  |
కీలక వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల చివర్లో జరగనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న కారణంగా ప్రస్తుతం ఉన్న స్థితినే కొనసాగించే వీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సెప్టెంబర్ 29 నుంచి మూడు రోజుల పాటు సమీక్ష జరగనుంది. అక్టోబర్ 1న నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఆగస్టులో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ భేటీలో కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది.

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు గత సమావేశంలో వడ్డీ రేట్ల విషయాన్ని పక్కనపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సుమారు 115 బేసిస్ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే మార్గాన్ని అనుసరించే వీలుందని, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశముందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ రాజ్‌కిరణ్ తెలిపారు.

కాగా, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదైంది. జులైలో ఇది 6.73 శాతంగా ఉంది. ఈ పరిణామాలతో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేసేందుకు ఆర్‌బీఐ ప్రయత్నించాలని కేంద్రం సూచించింది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను, ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకే ఆర్‌బీఐ నిర్ణయిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed