అమరవీరుల సాక్షిగా నేను రెడీ.. నువ్వు సిద్ధమా కేసీఆర్.. కోదండరామ్ సవాల్

by  |
అమరవీరుల సాక్షిగా నేను రెడీ.. నువ్వు సిద్ధమా కేసీఆర్.. కోదండరామ్ సవాల్
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : నిండు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అమావాస్యను పురస్కరించుకొని గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు టీజేఎస్ ఆధ్వర్యంలో బియ్యం అందించారు.

ఈ సందర్బంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..1.5 లక్షల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేశామని, త్వరలో మరో 80 వేలు భర్తీ చేస్తామని అనడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2.80 లక్షల ఉద్యోగ ఖాళీలున్నా.. ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. ఉద్యోగాలు రాకనే సునీల్ నాయక్, షబ్బీర్, నాగేశ్వరరావు, మురళీ, రామకృష్ణ, కొండల్ వంటి నిరుద్యోగులు ఎంతో మంది చనిపోయినా సీఎం కేసీఆర్.. కనీసం వారి కుటుంబాలను ఆదుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే నిరుద్యోగులు చనిపోయారని, వెంటనే వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. అమరవీరులను స్మరించుకొని, వారి ఆశయాలను సాధించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి చట్టబద్దత కల్పించాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగులకు భృతి ఇస్తామని మోసం చేశారని, ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వం భర్తీ చేసింది 77వేల ఉద్యోగాలు మాత్రమేనని తెలిపారు.

ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్ చేస్తున్న సవాల్‌కు తాను అమరవీరుల సాక్షిగా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర రావు, రాష్ట్ర నాయకులు నిజ్జన రమేష్ ముదిరాజ్, హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య, శ్రీధర్, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబుమహాజన్, ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్, డప్పు గోపి, తదితరులు పాల్గొన్నారు.


Next Story