ఆ కోడి ధర అక్షరాల లక్ష..!

by  |
ఆ కోడి ధర అక్షరాల లక్ష..!
X

దిశ, వెబ్‎డెస్క్: సాధారణంగా కోడి ధర నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. పందెం కోడి ధర అయితే పది వేల రూపాయలలోపు పలుకుతోంది. కానీ, ఓ జాతికి చెందిన కోడి ధర అక్షరాల లక్ష రూపాయలను దాటేసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్ల పెంపకం చేస్తున్నాడు. అరుదైన కోళ్లను పెంచుతూ కోళ్ల పెంపకంలో తనదైన ముద్ర వేసుకున్నాడు.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం తమిళనాడులోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడి కోడిపుంజును రూ.లక్షకు కొనుగోలు చేశాడు. అరుదైన జాతి కోళ్లను జల్లెడ పట్టేందుకు ఊర్లన్నీ తిరిగిందుకు అతనికి రూ.24 వేలు ఖర్చయింది. మొత్తానికి తమిళనాడు నుంచి కోడి పుంజును ఇంటికి తెచ్చేందుకు రూ.1.24 లక్షలు ఖర్చు చేశాడు. తన వద్ద ఉన్న కోళ్లలో ఒక్కటి కూడా రూ.30 వేలకు తక్కువ ధరలో లేవని పుల్లయ్య చెబుతున్నారు.

పది రోజుల పిల్ల రూ.5 వేలు, కోడి గుడ్డు రూ.1000 చొప్పున విక్రయిస్తుంటాడు. అరుదైన జాతికి చెందిన కోళ్లకు బలమైన ఆహారం ఇవ్వాలని, ఒక్కో కోడికి నెలకు రూ.3000 ఖర్చు అవుతుందని రైతు తెలిపారు. ఇక ఆయన దగ్గర కోళ్లను పెంచేందుకు బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరుశనగలు, రాగులు, సజ్జలను దాణాగా పెట్టాల్సి ఉంటుంది. కోళ్ల పెంపకం ద్వారా నెలకు రూ.30 వేలకు వరకు ఆదాయం పొందుతున్నట్లు పెద్ద పుల్లయ్య తెలిపారు. తన కోళ్లలో ఒక్కటి తెల్లటి రంగులో ఏడు కిలోల బరువు ఉండి 28 అంగుళాల ఎత్తు, మంచి సౌష్టవం కలిగి ఉన్న కోడి లక్ష రూపాయల పైన పలుకుతుందని రైతు గర్వంగా చెబుతున్నారు.


Next Story