రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ

by  |
రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ
X

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రైతులకు మద్దతుగా శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 విపక్షాల పార్టీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తూ మొండి పట్టుదలను వీడటం లేదని, ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నాయి. మూడు వ్యవసాయ చట్టాలు కూడా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని విఘాతం కలిగిస్తున్నాయని ఆక్షేపించాయి.

ఈ మేరకు కాంగ్రెస్‌తో సహా ఎన్‌సీపీ, జేకేఎన్‌సీ, డీఎంకే, ఏఐటీసీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఐయూఎంఎల్, ఆర్‌ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీల ‌లోక్‌సభ, రాజ్యసభల పక్ష నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘ఒకవేళ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థలు ఛిన్నాభిన్నమై జాతీయ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. రైతు సంఘాలు, రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కుదరకుండానే హడావుడిగా చట్టాలను తీసుకువచ్చారు.

పార్లమెంట్‌లో సరైన రీతిలో చర్చ జరపకుండా, కండబలంతో ప్రతిపక్షాలను చట్టసభల నుంచి బయటకు పంపించి, పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ చట్టాలను ఆమోదించుకున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని కఠినమైన చలి, భారీ వర్షాలను తట్టుకుని తమ హక్కులు, న్యాయం కోసం రైతులు గత 64 రోజులుగా పోరాడుతున్నారు. ఇప్పటివరకు 155 మంది రైతులు ప్రాణాలను కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరించడమే కాకుండా లాఠీచార్జీలు, బాష్పవాయువు, వాటర్ కెనన్లతో రైతులపై దాడికి పాల్పుడుతుంది. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని తీర్మానించాం’ అని తెలిపారు.


Next Story

Most Viewed