ఎనిమిది నెలల గర్భిణి .. 100 కిలో మీటర్లు నడక

by  |
ఎనిమిది నెలల గర్భిణి .. 100 కిలో మీటర్లు నడక
X

దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. పరిశ్రమలన్నీ మూత పడ్డాయ్. పొట్ట కూటి కోసం నగరానికి వచ్చిన వేలాది మంది కూలీలకు నిలువ నీడ లేకుండా పోయింది. తినడానికి తిండి లేదు.. ఉండటానికి గూడు లేదు, చేయడానికి పని లేదు. ఇక చేసేదేం లేక… స్వగ్రామామే దిక్కు అనుకుని.. అటుగా పయనమవుతున్నారు. బస్సులు లేక.. రైళ్లు లేక.. నడకే శరణ్యమని.. కంటితో దూరాన్ని.. కాళ్లతో కాలాన్ని కరిగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే… ఓ ఎనిమిది నెలల గర్బిణి తన భర్తతో కలిసి.. స్వగ్రామం వెళ్లడానికి సిద్దమైంది. ఆహారం తినకుండా.. దాదాపు 100 కిలో మీటర్లు కాలినడకన ప్రయాణించిన ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను పోలీసులు చేరదేసి, అన్నం పెట్టారు.

కరోనా వల్ల దేశంలో ఎంతోమంది పని కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి మరి దారుణంగా ఉంది. దినసరి కూలీలు ఉండేందుకు ఇళ్లు లేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఏ దిక్కు లేకపోవడంతో..వేలాది మంది కూలీలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా ఇబ్భందులు పడుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో.. మూటమూల్లెలు పట్టుకుని, భార్య పిల్లలతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఢిల్లీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు అన్నీ చోట్ల కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ ప్రదేశ్ లోని షహ్రాన్ పూర్ లోని ఓ కర్మాగారంలో వకీల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పరిశ్రమ మూత పడటంతో.. పని కోల్పోయాడు. జీతం లేకపోవడంతో.. ఇల్లు ఖాళీ చేశాడు. చేసేదేం లేక.. సామాన్లన్లీ చేత పట్టుకుని, ఎనిమిది నెలల గర్భిణీ అయిన.. తన భార్య యాస్మిన్ తో కలిసి.. తన సొంతూరు అమర్ ఘడ్ కు కాలి నడకన బయలు దేరాడు. అలా రెండు రోజులగా తిండితిప్పలు లేకుండా 100 కిలోమీటర్లు నడిచి.. మీరట్ లోని షోహ్రబ్ గేట్ ఊరికి చేరుకున్నారు. వారి పరిస్థితిని గమనించిన పోలీసులు , స్థానికులు ఆ దంపతులకు సాయం అందించారు. కొంత డబ్బు ఇవ్వడంతో పాటు, అంబులెన్స్లో వారి సొంతూరుకు తరలించారు.

హృదయ విధారక ఘటనలు:

ఇది వకీల్ ఒక్కడి పరిస్థితే కాదు. దేశంలో లాక్ డౌన్ వల్ల లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. జీతాలు లేకపోవడంతో.. మహా నగరాలు, పట్టణాల్లో ఉండలేక తమ స్వగ్రామాలకు తరలి వెళుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో నడుస్తూనే వెళుతున్నారు. ఇటీవలే ఓ దినసరి కూలీ అలా నడుస్తూ.. నడుస్తూ.. మధ్యలో గుండె ఆగి చనిపోయాడు. మరో సంఘటనలో… ఇద్దరు పిల్లలు వంద కిలోమీటర్లు నడవడంతో కాళ్లన్నీ బొబ్బలెక్కి, వాచిపోయాయి. వాళ్లకు కూడా పోలీసులే వాహనం ఏర్పాటు చేసి.. సొంత ఊళ్లో దిగబెట్టారు. కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారి వెంబడి నడుస్తూ వస్తున్న వారి కోసం పోలీసులే ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా హృదయాన్ని కలిచి వేసే సంఘటనలు ఎన్నో.

Tags : coronavirus, lockdown, pregnant, labour, walk, kilometers, police, help

Next Story