కింగ్ కోఠి ఆసుపత్రిలో రోగుల మృతిపై ‘HRC’లో పిటిషన్..

by  |
కింగ్ కోఠి ఆసుపత్రిలో రోగుల మృతిపై ‘HRC’లో పిటిషన్..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : నగరంలోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక నిన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ హెచ్ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ఒకవైపు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, కొవిడ్ రోగులకు కావాల్సిన బెడ్లు సిద్ధంగా ఉన్నాయని గొప్పగా చెబుతున్నారని, కానీ వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయని విమర్శించారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉంటే మిగతా ఆసుపత్రుల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా పని చేసినప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి ఈ శాఖను తీసుకోవడంతో కేవలం సమీక్షలకే పరిమితమయ్యారనన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కారణంగానే క్షేత్రస్థాయిలో ఇటువంటి లోపాలు తలెత్తుతున్నాయన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు, ఆక్సిజన్, బెడ్ల కొరత లేకుండా చూడాలన్నారు. కింగ్ కోఠి ఘటనకు బాధ్యులుగా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి,హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి, ఆసుపత్రి సూపరింటెండెంట్, నోడల్ అధికారికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన హెచ్ఆర్సీని కోరారు.

Next Story

Most Viewed