సురానా జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. 26 కోట్ల నగదు స్వాధీనం

by Mahesh |
సురానా జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు.. 26 కోట్ల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారం తెల్లవారు జామున నాసిక్‌లోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ దాడులు చేశారు. కాగా సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించింది. ఆదాయపన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ చాలా యాక్టివ్‌గా మారింది. ఇటీవల నాందేడ్‌లో భారీ దాడులు నిర్వహించి రూ.170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత, ఇప్పుడు నాసిక్ (నాసిక్ ఐటీ రైడ్)లో చర్యలు తీసుకుంటుండగా కోట్ల విలువైన నగదు పట్టుబడింది. ఈ దాడిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బంగ్లాలోని ఫర్నిచర్‌ను పగులగొట్టి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ చర్య నగరంలో సంచలనం సృష్టించింది.

ఈ ఆపరేషన్‌లో నాసిక్, నాగ్‌పూర్, జల్‌గావ్‌లకు చెందిన ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. బంగ్లాలో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడగా.. వాటిని లెక్కించేందుకు అధికారులకు 14 గంటల సమయం పట్టిందని చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని లెక్కించేందుకు ఆదాయపు పన్ను శాఖ పలు బృందాలను పిలిపించాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్ మొత్తం 30 గంటల పాటు కొనసాగింది. 50 నుంచి 55 మంది అధికారులు సురానా జ్యువెలర్స్ షాపుతో పాటు అతని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కార్యాలయంపై దాడులు చేశారు. అదే సమయంలో, రాకా కాలనీలో ఉన్న బులియన్ వ్యాపారి బంగ్లాలో కూడా ప్రత్యేక బృందం సోదాలు చేసింది. నగరంలోని పలు చోట్ల నగల వ్యాపారికి సంబంధించిన కార్యాలయాలు, వ్యక్తిగత లాకర్లు, బ్యాంకు లాకర్లలో కూడా సోదాలు చేశారు. మన్మాడ్, నంద్‌గావ్‌లలో వ్యాపారవేత్త కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.

Next Story

Most Viewed