- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో ‘పవర్’ కొనాల్సిందే.. కారణం ఇదే..!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి 26వ తేదీన గరిష్ట స్థాయిలో 13,688 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలు వినియోగించారు. వ్యవసాయానికి రోజూ సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుతున్నారు. ఎలాంటి సమయంలోనూ ఈ వినియోగం తగ్గకపోవడం గమనార్హం. దీంతో బహిరంగ మార్కెట్లో రోజూ 2,131 మెగావాట్ల విద్యుత్‌ను తాత్కాలికంగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులుగా కొనుగోలు వ్యయం కూడా భారీగా పెరగడంతో బడ్జెట్ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ ఏడాది మార్చి 26వ తేదీన గరిష్ట స్థాయిలో 13,688 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలు వినియోగించారు. వ్యవసాయానికి రోజూ సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్‌ను వాడుతున్నారు. ఎలాంటి సమయంలోనూ ఈ వినియోగం తగ్గకపోవడం గమనార్హం. దీంతో బహిరంగ మార్కెట్లో రోజూ 2,131 మెగావాట్ల విద్యుత్‌ను తాత్కాలికంగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులుగా కొనుగోలు వ్యయం కూడా భారీగా పెరగడంతో బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు తాజాగా రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. వ్యవసాయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో పరిశ్రమలు, గృహావసర వినియోగం భారీగా పెరిగిపోవడమే ఇందుకు కారణం.
10,936.45 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణ ఏర్పడిన(2 జూన్ 2014) నాటికి రాష్ట్రవ్యాప్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ కేవలం 4,529.36 మెగావాట్లు మాత్రమే. రాష్ట్రంలోని అన్ని థర్మల్ ప్లాంట్ల ద్వారా 2,282.50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. హైడల్ ప్రాజెక్టుల ద్వారా 2081.76 మెగావాట్లు, సోలార్, విండ్ ప్లాంట్ల ద్వారా 165.1 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. మొత్తంగా 4,529.36 మెగావాట్ల విద్యుత్ జనరేట్ అయింది. రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో 5,405 మెగావాట్ల పీక్ విద్యుత్ డిమాండ్ ఉంది. అయితే యావరేజ్‌గా విద్యుత్ సంస్థలు 117.25 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను సరఫరా చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్పత్తిని పెంచుకుంటూ పోయింది. ఉత్పత్తి పెంచినా మిగులు విద్యుత్ లేకపోవడం గమనార్హం. అదీకాక అదనంగా కరెంట్ కొనాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అయితే ఈ ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ 10,936.45 మెగావాట్లుగా ఉంటే వినియోగం మాత్రం 13,068 మెగావాట్లకు పైగా చేరుకుంది. దీంతో 2,131 మెగావాట్ల విద్యుత్‌ను ప్రభుత్వం ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్ని ప్లాంట్ల ద్వారా సగటున రోజుకు 267 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా వినియోగం భారీగా పెరిగిపోతోంది.
2131 మెగావాట్లకు పైగా కరెంట్ కొనుగోలు
రాష్ట్రవ్యాప్తంగా 13,068 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను వినియోగదారులు వాడుతున్నారు. సగటున రోజుకు 267 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 278.74 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో 55 మిలియన్ యూనిట్లను నగరవాసులు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే విద్యుత్ వాడకం ఇక్కడే ఎక్కువగా ఉంటోంది. పరిశ్రమలు భారీగా ఉండటంతో పాటు, గృహావసరాలు సైతం పెరగిపోవడంతో కరెంట్ వాడకం బాగా పెరిగిపోయింది. దీనికి తోడు ఇన్నిరోజులు లాక్ డౌన్ విధించిన మూలంగా వినియోగం మరింత ఎక్కువైంది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు కాకతీయ టీపీపీ స్టేజీ 2 ద్వారా 600 మెగావాట్లు, కేటీపీఎస్ 7 ద్వారా 800 మెగావాట్లు, భద్రాద్రి టీపీపీ యూనిట్ 1, 2, 3 ద్వారా 810 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణిలో రెండు యూనిట్ల నుంచి 600 చొప్పున 1200 మెగావాట్లు, లోయర్ జూరాల నుంచి 240 మెగావాట్లు, పులిచింతల 120 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అయినా కొనుగోలు మాత్రం తప్పడంలేదు.
మార్చి 31 నాటికి విద్యుత్ ఉత్పత్తి వివరాలు
థర్మల్ ప్లాంట్లు -4972,50 మెగావాట్లు
జల విద్యుత్ -2441.76 మెగావాట్లు
సోలార్, విండ్ -3522.19 మెగావాట్లు
మొత్తం -10,936.45 మెగావాట్లు
- Tags
- Electric power






