ఫ్రాన్స్‌లో అతిపెద్ద ఆరోగ్య కుంభకోణం.. కోర్టు ఏం చేసిందంటే..

by  |
Diet pill
X

దిశ, ఫీచర్స్: లాభాపేక్షనే ప్రాధాన్యంగా ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టిన ఓ ‘ఫార్మా’ కంపెనీపై కోర్టు చర్యలు తీసుకుంది. శరీర బరువు తగ్గించే మాత్ర విషయమై జనాన్ని తప్పుదోవ పట్టించిందన్న ఫ్రాన్స్‌కు చెందిన ‘సర్వియర్’ అనే ఔషధ సంస్థకు అక్కడి కోర్టు దాదాపు రూ.23 కోట్ల జరిమానా విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆధునిక ఆరోగ్య కుంభకోణాలలో ఒకటిగా ఈ స్కామ్ నిలవగా, ఆ ఒక్క డ్రగ్ వల్ల వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 6,500 మందికి పైగా బాధితులు సర్వియర్ లాబోరేటరీపై 2019లో కేసు వేయగా, పారిస్ ట్రిబ్యునల్ తాజాగా తన తీర్పు వెలువరించింది.

మీడియేటర్ అనే ఔ‌షధాన్ని ‘డైట్ పిల్‌’‌గా అనుమతిస్తూ, దాన్ని విస్తృతంగా, బాధ్యతా రహితంగా సూచించడాన్ని కోర్టు తప్పు పట్టింది. ఈ డ్రగ్ అనుమతించడం ద్వారా ప్రాణాంతక పరిణామాలతో రోగుల సంక్షేమం కంటే లాభాలకు ఫార్మా కంపెనీ ప్రాధాన్యతనివ్వడం శోచనీయమని తెలిపింది. మీడియేటర్ టాబ్లెట్‌ను అధిక బరువున్న మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఆ సంస్థ తయారుచేయగా, దాదాపు 33 ఏళ్ల పాటు మార్కెట్‌లో దీని అమ్మకాలు కొనసాగాయి. ఈ మాత్ర వాడకం వల్ల తీవ్రమైన గుండె సమస్యలతో పాటు అనేక దుష్ప్రభావాలు రావడంతో ఇటలీ, స్పెయిన్ సహా చాలా యురోపియన్ దేశాలు 2000ల ఆరంభంలోనే నిషేధించాయి. కానీ ఫ్రాన్స్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తులకు, ఇతరులకు దీన్ని వైద్యులు సూచిస్తూ వచ్చారు.

30 ఏళ్లలో దాదాపు 50 లక్షల మందికి వైద్యులు ఈ మాత్రను సూచిస్తూ వచ్చారు. ఈ మాత్ర వల్ల జరుగుతున్న నష్టాన్ని, కలిగిస్తున్న దుష్ర్పభావాల గురించి ఫ్రాన్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇరీన్ ఫ్రాకన్ అవగాహన కల్పించడంతో ఆందోళన వెల్లువెత్తాయి. దాంతో సర్వియర్ ఈ మాత్రను నిషేధించింది. 6,500 మంది బాధితులు సర్వియర్‌పై కేసు వేసి, కోర్టును ఆశ్రయించారు. ఈ ఒక్క పిల్ కారణంగా సుమారు 2 వేల మంది మరణించి ఉంటారని ఓ అధ్యయనం అంచనా వేసింది. జడ్డిలు సర్వియర్‌ సంస్థకు 2.7 మిలియన్ యూరోల ఫైన్ (రూ.23 కోట్లు) విధించడంతో పాటు బాధితులకు వందల మిలియన్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబీకులకు, ఇతర దుష్ర్పభావాలకు గురైన వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా తీర్పు ఇచ్చారు. సర్వియర్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జీన్-ఫిలిప్ సేటాకు కోర్టు సస్పెండ్ చేసింది. నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వ్యవహారంలో ఫ్రాన్స్ ఔషధ నియంత్రణ సంస్థ పాత్ర కూడా ఉందని, ఆ సంస్థ బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ సంస్థకు కూడా సుమారు రూ.2.5 కోట్ల జరిమానా విధించింది.

Next Story

Most Viewed