ష్.. గప్‌చుప్..! ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

by Shiva |
ష్.. గప్‌చుప్..! ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
X

దిశ, నల్లగొండ బ్యూరో: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మూడు ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించి విస్తృతంగా ప్రచారం చేశాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితర నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. కాగా, మూడు ఉమ్మడి జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఐదుగురు చొప్పున బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Next Story

Most Viewed