హాట్ న్యూస్: కరప్షన్‌పై నో యాక్షన్..! 3,336 విజిలెన్స్ రిపోర్టులు పెండింగ్

by Shiva |
హాట్ న్యూస్: కరప్షన్‌పై నో యాక్షన్..! 3,336 విజిలెన్స్ రిపోర్టులు పెండింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి పాల్పడితే కన్న కొడుకు, కూతురినైనా వదిలేది లేదంటూ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దానిని ఆచరించలేదనేది స్పష్టమవుతున్నది. అవినీతి ఆరోపణలు, అవకతవకల ఫిర్యాదులపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఎక్కువగా కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించిన మంత్రిత్వశాఖలు, వాటికింద పనిచేసే విభాగాలపైనే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విజలెన్స్ ఎంక్వయిరీ సైతం జరిగింది. అనంతరం ఆ రిపోర్టులు నాటి ప్రభుత్వానికి చేరాయి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, సిబ్బందిపై మాత్రం పదేండ్ల కాలంలో ఒక్క చర్య సైతం తీసుకోలేదు. ఆ రిపోర్టులన్నీ ప్రభుత్వం వద్దే పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

‘లైట్ తీస్కో’ ఫార్ములా

బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మొత్తంగా 3,336 విజిలెన్స్ రిపోర్టులు వస్తే అందులో 1,230 సీరియస్ స్వభావంతో కూడుకున్నవేనని తేలింది. ఇకపైన అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా శాఖలకు సూచించిన రిపోర్టులు 1,215 ఉన్నాయి. ఇక విశ్లేషణా (అప్రైజల్) నివేదికలు 768, సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం మరో 123 చొప్పున ఉన్నాయి. వీటిలో దేనిపైనా అప్పటి ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించలేదు. ఎక్కువగా రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందినవే ఉండటం, ఈ శాఖలు అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ ఆధీనంలోనే ఉండటం గమనార్హం. ఈ విజిలెన్స్ రిపోర్టుల వ్యవహారం ఇప్పటి వరకు గోప్యంగా ఉండగా.. సమాచార హక్కు చట్టంతో బయటకు వచ్చింది. విజలెన్స్ విభాగం సమర్పించిన రిపోర్టులన్నింటినీ ‘లైట్ తీస్కో’ ధోరణిలోనే నాటి ప్రభుత్వం వీటిని పక్కకు పెట్టింది. విజిలెన్స్ రిపోర్టుల్లో ఆయా శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిపై స్పష్టమైన ఆధారాలను ప్రస్తావించి చర్యలు తీసుకోడానికి వీలుగా ప్రభుత్వానికి రిపోర్టు పంపినా దానికి తగిన కార్యాచరణ లేదని అనేక వివరాలతో తేటతెల్లమైంది.

బాధ్యులపై చర్యలు శూన్యం

ఫిర్యాదులు వచ్చిన తర్వాత దర్యాప్తు జరిపి అవినీతి, అవకతవకలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోడానికి మాత్రమే కాకుండా.. ఇకపైన అవి కుంభకోణాలుగా మారడానికి ఉన్న పరిస్థితులు, కారణమవుతున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ ‘అలర్ట్ నోట్‌’లను సైతం విజిలెన్స్ విభాగం నాటి ప్రభుత్వానికి పంపింది. మొత్తం నాలుగు రకాల రిపోర్టులను గవర్నమెంట్‌కు అందజేసినట్టు తేలింది. తీవ్ర అవినీతి కేసులు (సీరియస్ స్వభావంతో కూడిన), విశ్లేషణ నివేదికలు (అప్రైజల్ రిపోర్టు), అలర్ట్ నోట్‌లు, సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ రిపోర్టులు అనే తీరులో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పదేండ్ల కాలంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పంపించింది.

పదేండ్లలో మూడు వేలకు పైగా రిపోర్టులను (నాలుగు రకాలు కలిపి) ప్రభుత్వానికి పంపినా ఒక్కదానిపైనా నాటి సర్కారు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అవినీతి జరిగినట్టు దర్యాప్తులో తేలిన తర్వాత సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడంతో పాటు భవిష్యత్తులో రిపీట్ కాకుండా సిస్టమ్‌ను మెరుగుపర్చడం (ఇంప్రూవ్‌మెంట్)పైనా సూచనలు చేసింది. మరికొన్ని సందర్భాల్లో అవినీతి జరిగే అవకాశాలను ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వానికి సూచనలు సైతం చేసింది. ఇలాంటి వాటిని నాటి ప్రభుత్వం సంబంధిత శాఖలు, విభాగాలు, హెచ్ఓడీలలోని ఉన్నతాధికారులకు మాత్రమే పంపి సైలెంట్‌గా ఉండిపోయింది. అవినీతికి పాల్పడినట్టు తేలినా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోకపోవడంతో శిక్ష పడుతుందనే భయం సైతం వారిలో ఉండడం లేదనే అభిప్రాయాలు నెలకొన్నాయి.

సమాచార హక్కు చట్టం కింద..

పదేండ్ల కాలంలో విజిలెన్స్ డిపార్టుమెంటు నుంచి ప్రభుత్వానికి వెళ్లిన రిపోర్టుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఇటీవల (గత నెలలో) అందుకున్నారు. గతంలోనూ ఇలాంటి వివరాలు రావడంతో అప్పటి గవర్నర్, ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనం ఉండదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రబలుతుందన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్న అవినీతి కారణంగా సామాన్యులకు ప్రభుత్వపరంగా సేవలు అందడంలేదని, అనివార్యంగా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతున్నదని, ఈ విధానంలో మార్పు రావాలంటే తప్పులకు పాల్పడిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖల్లో కోరారు. విజిలెన్స్ డిపార్టుమెంటు నుంచి అందిన వివరాలను పరిశీలిస్తే ఎక్కువగా కేసీఆర్, కేటీఆర్ బాధ్యత వహించిన పురపాలక శాఖ, దాని పరిధిలో పనిచేసే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ శాఖలకు చెందినవే ఉన్నాయి.

గత ప్రభుత్వ స్పందన ఈ తీరులో ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వమైనా సీరియస్‌గా వ్యవహరించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి రెండు రోజుల క్రితం పద్మనాభరెడ్డి లేఖ రాశారు. అవినీతి అధికారులకు కొమ్ముకాస్తూ విజిలెన్స్ రిపోర్టులపై ప్రభుత్వం, సచివాలయంలోని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదని, ఈ రీజన్‌తో శిక్ష పడుతుందనే భయం ఉద్యోగుల్లో ఏ కోశానా లేదని, ఈ పరిస్థితిని చక్కదిద్దాలని రిక్వెస్టు చేశారు. హెచ్ఎండీఏలో ఎక్కువగా భూమి విలువలను బట్టి లంచం రేటు ఖరారవుతున్నదని, లంచం ఇవ్వకపోతే పనులే కావడంలేదని, ప్రజలు బలి అవుతున్నారని ఆ లేఖలో పద్మనాభరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తీరుతో అవినీతిరహిత పాలన అందుతుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లిందని, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దృష్టి పెట్టాలని సీఎంను ఆ లేఖలో కోరారు. పెండింగ్‌లోని విజిలెన్స్ రిపోర్టులను తేల్చే పనిలో ప్రస్తుత ప్రభుత్వం నిమగ్నమైంది. దానికి మొదటి సంకేతంగా మైనింగ్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు సిబ్బందిని ఇటీవల ట్రాన్స్‌ఫర్ చేసింది.

శాఖల వారీగా రిపోర్టులు ఇలా..

పురపాలక శాఖ - 633

రెవెన్యూ శాఖ - 500

పంచాయతీ రాజ్ - 298

వ్యవసాయం - 262

Next Story

Most Viewed