రాత్రికిరాత్రే భూకబ్జా.. ఆపై ప్రైవేటు బందోబస్తు

by  |
Land grab
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్​కు అత్యంత సమీపం. హైటెక్​సిటీకి దగ్గర.. ఖాజాగూడ ప్రధాన రహదారి.. ఐతేనేం.. బలం, పలుకుబడి, అర్ధబలం ఉండాలే గానీ.. తెల్లారేసరికి కబ్జా సాధ్యమే. రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలమని అన్ని రెవెన్యూ, స్టాంప్స్ అండ్​రిజిస్ట్రేషన్​శాఖల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఐతేనేం..? అధికారుల అండదండలు ఉన్నాయి. ప్రజాప్రతినిధుల మద్దతు కూడా ఉంది. అందుకే అందరూ గప్​చుప్..!

గజం రూ.లక్ష పలుకుతోంది. ఒకటీ రెండు కాదు.. అక్కడ 60 ఎకరాలకు పైగా సర్కారు భూమి ఉంది. కానీ దాన్ని కాపాడే అధికార స్థానిక రెవెన్యూ యంత్రాంగం నిద్రబోతోందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే రాత్రికిరాత్రే ఫెన్సింగులు ఏర్పడుతున్నాయి. అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కాపాడడంలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. రికార్డుల్లోని విస్తీర్ణానికి క్షేత్ర స్థాయి విస్తీర్ణానికి మధ్య అంతులేని వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. కబ్జా విషయం ముందే తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించడంతో ఆక్రమణలకు రూట్​క్లియర్​అవుతుందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కబ్జా చేస్తున్నారంటూ మౌఖికంగా, మరికొన్ని ప్రాంతాల్లో లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినా, ఫిర్యాదు చేసినా సకాలంలో అధికారులు స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటన్న అనుమానాలు కలుగుతున్నాయి. అధికారుల సహకారం లేకపోతే ఎకరాల విస్తీర్ణాన్ని హస్తగతం చేసుకోవడం అసాధ్యమంటున్నారు.

Occupied

ఎక్కడైనా 60 గజాల్లో ఎవరైనా పేదలు ఇల్లు కట్టుకుంటున్నారని తెలిస్తే .. వెంటనే పొక్లెయిన్​తో క్షేత్ర స్థాయికి వచ్చేస్తారు. అలాంటి రెవెన్యూ యంత్రాంగానికి ఈ ఆక్రమణల పర్వాన్ని ముందే పసిగట్టడం పెద్ద పని కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఐతే ఇందులో రాజకీయ నాయకుల పరోక్ష ప్రమేయం, మద్దతు ఉండడం వల్లనే ముందుగానే శేరిలింగంపల్లి తహశీల్దార్​కార్యాలయానికి సమాచారాన్ని ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చాప కింద నీరులా రెవెన్యూ సిబ్బంది సహకరిస్తుండడం వల్లే ప్రభుత్వ స్థలాలు హారతి కర్పూరంగా మారుతున్నాయి.

అందుకే భూ కబ్జా తంతు మొత్తం పూర్తయిన తర్వాత తాపీగా ఏమి తెలియనట్లు నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే తప్పదన్నట్లుగా అంటి ముట్టనట్లుగా కూల్చివేతలకు పాల్పడుతున్నారు. మొత్తం కూల్చేయకుండా పాక్షికంగా కూల్చేసి తాము విధులు పక్కాగా నిర్వహించామంటూ ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నారు. అందుకే మళ్లీ మళ్లీ అవే భూముల్లో కబ్జా పర్వాలు దర్శనమిస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు.

చిన్నబోయిన సర్వే నం.27

ఖాజాగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నం.27లో 64 ఎకరాల సర్కారు భూమి. దశాబ్దాలుగా అది ప్రభుత్వానిదే. కానీ కొందరు అక్రమార్కులు ఏకంగా జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకున్నామంటూ నిర్మాణాలను మొదలు పెడుతున్నారు. కోర్టు తీర్పులు ప్రయివేటు వ్యక్తులకు వ్యతిరేకంగా వచ్చినా అవే భూములపై పెత్తనం చెలాయిస్తున్నారు. తాజాగా ఇదే సర్వే నంబరులోని 2 వేల గజాల స్థలానికి రాత్రికి రాత్రే కొందరు అక్రమార్కులు ఫెన్సింగ్​ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ ప్రయివేటు సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకుండా పహారా కాస్తున్నారు.

ఈ దశలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తాపీగా వచ్చి పాక్షికంగా కూల్చేసి వెళ్లిపోయారని తెలిసింది. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోకుండానే స్థానిక రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సర్వే నంబరులోని మొత్తం విస్తీర్ణంపై సర్వే చేస్తే ఎవరెంత కబ్జా చేశారో తెలుస్తుంది. పెద్ద మనుషులే తెర వెనుక ఉండి భూదందాను నడిపిస్తున్నారని సమాచారం. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లే రెవెన్యూ సిబ్బంది అటువైపు వెళ్లడం లేదని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఖాజాగూడలో అంతే..

సర్వే నం.27/2లో సికిందర్​ఖాన్ పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), సలాబత్​ఖాన్​పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), యూనస్​ఖాన్​పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), మన్సూర్​ఖాన్​పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), హిమాయత్​ఖాన్​పేరిట 2.30(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), హజ్రాఖాన్​పేరిట 2.30 ఎకరాలు((మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), మోతిబాను పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), సఫియాబాను పేరిట 2.30 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), బాదర్​బాను పేరిట 2.29 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), సరిదాబాను పేరిట 2.29 ఎకరాలు((మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు) చూపిస్తున్నది. సర్వే నం.27/2/ఎ లో రాజేశ్​కుమార్ పేరిట 2 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు), సర్వే నం.27/3లో జంగయ్య పేరిట 5 ఎకరాలు(మార్కెట్​విలువ రూ.9.68 కోట్లు)గా రికార్డులు చెబుతున్నాయి. కానీ అవన్నీ సివిల్​కోర్టు కేసుల్లో ఉన్నాయని ధరణి పోర్టల్​స్పష్టం చేస్తోంది. సర్వే నం.27 లో మొత్తం 64.26 ఎకరాలు ఉంది. రిజిస్ట్రేషన్​అండ్​స్టాంప్స్​శాఖ వెబ్​సైట్​ప్రకారం సర్వే నం.27లోని 64.26 ఎకరాలు ప్రభుత్వానిదే. అలాగే 200 గుంటల భూమిని అసైన్ చేసినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ రిజిస్ట్రేషన్ నిషేదిత జాబితా(పీఓబీ)లో నమోదు చేశారు. అలాగే ధరణి పోర్టల్​లో సర్వే నం.27/1లో 30.08 ఎకరాలు ప్రభుత్వ భూమిగా పేర్కొంది.

బోర్డులు పెట్టని రెవెన్యూ శాఖ

ఎక్కడైనా 100 గజాల ప్రభుత్వ స్థలం ఉందని తెలిస్తే వెంటనే ఇది ప్రభుత్వ స్థలం, ఎవరూ కబ్జాకు యత్నించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ పెద్ద పెద్ద బోర్డులు పెడతారు. ఖాజాగూడలో రూ.కోట్ల విలువైన సర్కారు స్థలం. ఒకటీ రెండెకరాలు కాదు.. 64 ఎకరాలు.. ఇక దాని విలువ ఎంతో లెక్కేసుకోండి. ఇక్కడ మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ స్థలాలను కాపాడే రెవెన్యూ యంత్రాంగం ఈ విషయంలో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఐతే శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ భూముల కబ్జాలు, కొందరు అవినీతి అధికారులపై విజిలెన్స్, ఏసీబీ దృష్టి పెట్టిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఖాజాగూడలోని సర్వే 27 లోని ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.


Next Story

Most Viewed