న్యూయార్క్ తెలుగు సంఘం 2026 కార్యవర్గం ఎంపిక.. నైటా కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల

by Ramesh Naini |   (  Updated:2025-12-06 16:24:21  IST  )

ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో నివసిస్తున్న తెలుగు వారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) 2026 కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

న్యూయార్క్ తెలుగు సంఘం 2026 కార్యవర్గం ఎంపిక.. నైటా కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో నివసిస్తున్న తెలుగు వారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) 2026 కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు. అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్ఆర్ఐలు ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటా ను ఆరేళ్ల కిందట ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకు ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టి పెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండుగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా రవీందర్ తన వంతు పాత్ర పోషించారు. డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పని చేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్ లో స్థిరపడ్డారు. సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.

Next Story