- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, నేషనల్ డెస్క్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మరోసారి కశ్మీర్ లో నరమేధం సృష్టించింది. పహల్గామ్ లో చోటుచేసుకున్న ఊచకోతలో 27మంది వరకు టూరిస్టులు చనిపోయారని తెలుస్తున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉన్నదని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. అక్రమ చొరబాట్లు ఆగిపోయాయని.. సీమాంతర ఉగ్రవాదం కథ ముగిసిందని కేంద్రం, ఆర్మీ చెప్తున్నదంతా డొల్లేనని ఈ ఘటనతో తేటతెల్లం అయిపోయింది. అయితే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సమయంలో.. ఉగ్రదాడి జరగడం యాదృశ్చికం కాదని, గతంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2000 లో మార్చి 19 నుంచి 25 వరకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియాలో పర్యటించారు. సరిగ్గా మార్చి 20 వ తేదీన కశ్మీర్ లోని చిట్టాసింగ్ పురాను ఉగ్రవాదులు చుట్టుముట్టి.. సిక్కులను ఒకచోటికి చేర్చి మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35 మంది చనిపోయారు. భారత్ అణు పరీక్షలు జరిపిన తరువాత తొలిసారి భారీగా ఆంక్షలు విధించిన అమెరికా బిల్ క్లింటన్ హయాంలోనే ఉదారంగా వ్యవహరించడం మొదలైంది. అందులో భాగంగానే క్లింటన్ ఇండియాకు రావడం.. అనేక ఆంక్షలు తొలగించారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామిగా కూడా ప్రకటించారు. భారత్ లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగానే క్లింటన్ పర్యటన జరిగిందన్నది అందరికీ తెలిసిందే. దీనిని దెబ్బతీయడానికే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కూడా నిఘా వర్గాలు ఆరోపించాయి. అదే ఏడాది ఆగస్టులో కశ్మీర్ కేంద్రంగా మరో భారీ ఉగ్రదాడి జరిగింది. అమర్ నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులపై పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు. లష్కర్ ఏ తాయిబా ఈ ఘటనకు పాల్పడిందని సైన్యం నిర్ధారించింది.






