వచ్చేసింది.. వర్చువల్ మొబైల్ నెంబర్!

by  |
వచ్చేసింది.. వర్చువల్ మొబైల్ నెంబర్!
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్ద షాపింగ్‌మాల్స్‌లో షాపింగ్ చేసి, బిల్ చేసేటపుడు ‘సార్ మీ మొబైల్ నెంబర్?’ అని అడుగుతుంటారు. అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాక ప్రతి ఆఫర్ గురించి మెసేజ్‌లు వస్తుంటాయి, కొన్నిసార్లు కాల్స్ కూడా వస్తుంటాయి. కేవలం షాపింగ్ మాల్స్‌లో మాత్రమే కాకుండా ఫుడ్ డెలివరీకి, మ్యాట్రిమొనీలకు ఇంకా చాలా ఆన్‌లైన్ సర్వీస్‌లకు పర్సనల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అబ్బాయిలైతే ఓకే.. మరి అమ్మాయిల వ్యక్తిగత నెంబర్ ఇవ్వడం ఎంతవరకు శ్రేయస్కరం? అలాగే ఇలా వ్యక్తిగత నెంబర్లను సేకరించి, మార్కెటింగ్ అవసరాల కోసం పెద్ద మొత్తానికి అమ్ముకుంటున్న కన్సల్టెన్సీలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఆదిత్య వుచికి కూడా ఓ షాపింగ్ మాల్‌లో ఇలాంటి సమస్యే ఎదురైంది. కానీ ఆయన మనలాగ ప్రశ్నించి ఊరుకోలేదు. ఆలోచించాడు. దీనికి పరిష్కారాన్ని చూపిస్తూ ‘దూస్రా’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. మరి దీని వల్ల ఉపయోగమేంటి?

దూస్రా యాప్ వల్ల ఎలాంటి సిమ్ కొనుగోలు చేయకుండానే 10 అంకెల వర్చువల్ మొబైల్ నెంబర్ పొందవచ్చు. ఇలా ఫోన్ నెంబర్ అడిగే చోట్లలో ఈ వర్చువల్ నెంబర్ ఇవ్వడం ద్వారా స్పామ్ కాల్స్, మెసేజ్‌లు, ఫ్రాడ్ జరిగే అవకాశాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ స్టార్టప్‌ను హైద్రాబాద్‌లోనే సెప్టెంబర్ నెలలో ఆవిష్కరించినట్లు ఆదిత్య తెలిపారు. అయితే ఇలాంటి సదుపాయాన్ని ఎక్సోటెల్, నోలారిటీ లాంటి సంస్థలు ఇప్పటికే అందిస్తున్నాయి. అయితే కంపెనీ లేదా ఎంటర్‌ప్రైజ్ స్థాయిలకు మాత్రమే ఈ సంస్థల సేవలు పరిమితమయ్యాయి. వ్యక్తిగత యూజర్స్‌కు ఈ సదుపాయాన్ని కల్పించే యోచనతో దూస్రాను ప్రారంభించినట్లు ఆదిత్య వెల్లడించారు.

దూస్రా నెంబర్‌కు వచ్చిన కాల్స్ అన్నీ నేరుగా వాయిస్ మెయిల్‌కు వెళ్తాయి. సాధారణ ఫోన్‌ చర్యలకు విరుద్ధంగా ఇది పనిచేస్తుంది. సాధారణ ఫోన్‌లో ఇష్టం లేని కాంటాక్ట్‌లను బ్లాక్ చేయవచ్చు, కానీ దూస్రాలో ఇష్టం ఉన్న కాంటాక్ట్‌లను మాత్రమే అనుమతించవచ్చు. అంటే డీఫాల్ట్‌గా అన్ని కాంటాక్ట్‌లు బ్లాక్ చేసి ఉంటాయన్నమాట. ట్రస్టెడ్ కాంటాక్ట్ నెంబర్ జోడించడం ద్వారా ఆ నెంబర్‌ నుంచి కాల్స్ పొందవచ్చు. అలాగే సంబంధిత సమయంలో, సంబంధిత లొకేషన్‌లో మాత్రమే కాల్స్‌ను అనుమతించేలా కూడా దీన్ని సెట్ చేయవచ్చు. ఇందుకు కేవలం ఈ యాప్‌కు లొకేషన్ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో, డుంజో, ఓలా, అర్బన్ కంపెనీ యాప్‌లతో దూస్రా ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీల సర్వర్ నుంచి చేసిన నెంబర్లకు మాత్రమే దూస్రా నెంబర్‌కు అనుమతి ఉంటుంది. మిగతా అన్ని స్పామ్ కాల్స్, మెసేజ్‌లను దూస్రా బ్లాక్ చేస్తుంది. దీని వల్ల అటు పర్సనల్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు, అలాగే ఎవరైనా అడిగితే దూస్రా నెంబర్ కూడా ఇవ్వవచ్చు.


Next Story

Most Viewed