కరోనా ఫ్రీగా సూర్యాపేట!

by  |
కరోనా ఫ్రీగా సూర్యాపేట!
X

దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కరోనా ఫ్రీగా మారింది. జిల్లాలో నెల రోజుల్లో మొత్తం 83 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నిరంతర సమీక్షలు నిర్వహించారు. రెడ్‌జోన్‌లో పర్యటించి కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తగ్గించే ప్రయత్నం చేశారు. అనంతరం బాధితులంతా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇండ్లకు చేరుకున్నారు. సూర్యాపేటలో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌గా ప్రకటించి ప్రాథమిక కాంటాక్టులు జరగకుండా చర్యలు చేపట్టారు. కరోనా కేసులు తగ్గినా జిల్లా కేంద్రంతోపాటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వైద్య బృందాలు ఇంటింటా పరీక్షలు నిర్వహించి కరోనా అనుమానితులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వాస్పత్రి ఐసోలేషన్‌తో పాటు చివ్వేంల మండలంలోని బీసీ మహిళా గురుకుల విద్యాలయం, మైనార్టీ పాఠశాల, అరవిందాక్ష క్వారంటైన్లలో అనుమానితులను ఉంచారు. జిల్లాలో మొత్తం 159 వైద్య బృందాలతో సర్వే చేపట్టి వేలాది మంది రక్తనమూనాలను పరీక్షల కోసం పంపించారు.

కొనసాగుతున్న పర్యవేక్షణ

కరోనా పాజిటివ్‌లు కొత్తగా ఏమీ బయటపడనప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ పోతోన్నది. ఇప్పటి వరకు క్వారంటైన్‌ చేసిన ప్రాంతాలతో పాటు రద్దీ ఉండే ప్రాంతాలు, జిల్లాల సరిహద్దుల్లో సైతం స్క్రీనింగ్‌లు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు కేసులు నమోదైన ప్రాంతాల్లో సైతం వెళ్లి స్క్రీనింగ్‌లు, పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కఠినంగా లాక్‌డౌన్‌ నిబంధనలు..

ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన కొన్ని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను ఎత్తివేసినప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలతోపాటు రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాల్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు ఏమీ నమోదు కాకపోవడంతో కూరగాయలు, కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసరాలు, మందుల దుకాణాల తెరిచి ఉంచే సమయంపై ఆంక్షలను సడలించారు.

ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కరోనా ఫ్రీ గా మారినా లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించవద్దు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకూ తమ పక్కనే కరోనా వైరస్ ఉందని భావించి, ప్రభుత్వం, వైద్యులు ఇస్తున్న సూచనలను పాటించాలి. భౌతిక దూరం, స్వీయ నియంత్రణనే మనకు రక్ష. సూర్యాపేట కరోనా ఫ్రీ గా మారడంలో భాగస్వామ్యం అయిన పట్టణ ,గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ధన్యవాదాలు.

Next Story