నిర్మల్‌ను టూరిజం హబ్‌గా చేస్తాం….

by  |
నిర్మల్‌ను టూరిజం హబ్‌గా  చేస్తాం….
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
నిర్మల్‌ను టూరిజం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌‌లోని శ్యామ్ ఘడ్ కోటను మంత్రి ఆదివారం సందర్శించారు. కోటలో ఏర్పాటు చేయనున్న ఎల్‌ఈ‌డీ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నిమ్మరాజుల కాలం నాటి నిర్మల్ పురాతన కోటలు బత్తిస్ ఘడ్,శ్యామ్ ఘడ్, ఖిల్లా గుట్ట, సొన్ పురాతన వంతెన‌‌లను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. శ్యామ్ ఘడ్‌లో ఎల్‌ఈ‌డీ లైటింగ్ ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటల తరువాత ప్రజల సందర్శనకు అనుమతి ఇస్తామన్నారు. కోట చుట్టూ వాకింగ్ ట్రాక్, క్యాంటీన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోట‌కు ముందు ఉన్న కంచెరోని చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించి బోటింగ్ సదుపాయం కలిపించనున్నట్టు తెలిపారు. చెరువు పైన వీధి దీపాలను సైతం ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. అదే విధంగా సొన్ వంతెన పైన వాకింగ్‌కు అనుగుణంగా ఉండేలా లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి సాయంత్రం వేళల్లో టీ స్నాక్స్ కు సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. జిల్లా కేంద్రంలో పర్యటకుల కోసం హరిత హోటల్ మంజూరు అయ్యిందని అన్నారు. పాత ఐబీ భవనం దగ్గర హరిత హోటల్ ను నిర్మిస్తామని వెల్లడించారు. కుంటాల పొచ్చేర జలపాతాలకు వెళ్లే సందర్శికులు నిర్మల్‌లో విడిది చేసేలా సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు.

Next Story