NIFTY : ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ

by  |
NIFTY : ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి నిఫ్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను సాధించాయి. ఉదయం ప్రారంభం నుంచే సానుకూలంగా మొదలైన సూచీలు చివరి వరకూ అదే జోరును కొనసాగించాయి. కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తుందనే అంచనాలు, కరోనా కేసులు తగ్గుతుండటం, టీకా పురోగతి నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా నిఫ్టీ వరుసగా ఆరో రోజు లాభాలను దక్కించుకోవడంతో ఆల్‌టైమ్ గరిష్ఠ లాభాలను సాధించింది. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్రకటించడంతో అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా ప్రభావితం చేశాయని నిపుణులు చెప్పారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 307.66 పాయింట్లు ఎగసి 51,422 వద్ద ముగియగా, నిఫ్టీ 97.80 పాయింట్లు లాభపడి 15,435 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, మెటల్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల్లో కొనుగోళ్లు నిఫ్టీ జీవితకాల గరిష్ఠాలకు మద్దతునిచ్చాయి. ఇక, ఫార్మా, ఐటీ, మీడియా రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ షేర్ ధర అధికంగా 5.90 శాతం పుంజుకోగా, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించగా, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డా రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.50 వద్ద ఉంది.

Next Story