తెలుగు అకాడమీలో సరికొత్త ట్విస్టు.. విచారణలో షాకింగ్ నిజాలు

by  |
తెలుగు అకాడమీలో సరికొత్త ట్విస్టు.. విచారణలో షాకింగ్ నిజాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర తెలుగు అకాడమీ అవినీతి వ్యవహారంలో తవ్వినాకొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 15 మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వులతో వారంతా జైలులో ఉన్నారు. కొద్దిమందిని నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది. వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు కృష్ణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టయినవారి సంఖ్య 16కు చేరుకున్నది. అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను దారిమళ్ళించి కాజేసిన వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న సాయికుమార్ అనే వ్యక్తితో కృష్ణారెడ్డికి సంబంధం ఉన్నట్లు తేలింది. అకాడమీకి చెందిన వ్యక్తుల్ని పరిచయం చేసినందుకు, ఏ అడ్డదారిలో వెళ్తే డబ్బుల్ని దారిమళ్ళించవచ్చో సలహా ఇచ్చినందుకుగాను కృష్ణారెడ్డికి రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పూర్తి వివరాలను కృష్ణారెడ్డి నుంచి రాబట్టిన తర్వాత తేలుతుంది.

వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో అకాడమీకి చెందిన డబ్బులు ఉన్నాయో, వాటిని ఏయే పద్ధతుల్లో కొట్టేయవచ్చో కృష్ణారెడ్డి, సాయికుమార్ పలుమార్లు సమావేశమై చర్చించుకున్నారని, చివరకు వారి మధ్య వాటాల విషయంలో తేడాలు రావడంతో కృష్ణారెడ్డి పక్కకు తప్పుకోవాల్సి వచ్చినట్లు ఇప్పటివరకు పోలీసులకు అందిన సమాచారం. మున్ముందు కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. అకాడమీకి చెందిన బ్యాంకుల్లోని డిపాజిట్లను కాజేయాలని ప్లాన్ ఇచ్చింది కృష్ణారెడ్డి అని పోలీసుల బలమైన అనుమానం. ఈ సలహా కోసం మొదటి దఫాలోనే రెండున్నర కోట్లు తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ప్లాన్ మొత్తం సక్సెస్ అయినందున తగినంత వాటా కావాలని కోరినందున అంత మొత్తంలో ఇచ్చుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో సాయికుమార్ పక్కకు పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.


Next Story

Most Viewed