క్రెడిట్ కోసం ఉద్యోగ సంఘాల పాలి‘ట్రిక్స్’

by  |
క్రెడిట్ కోసం ఉద్యోగ సంఘాల పాలి‘ట్రిక్స్’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ సంఘాల్లో సరికొత్త పాలి‘ట్రిక్స్’ మొదలయ్యాయి. ఇప్పటి వరకు ఫిట్‌మెంట్‌పై ఆందోళన చెందినా.. సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత మెరుగైన విధంగానే ప్రకటిస్తారనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల క్రెడిట్ కోసం ప్లాన్​ వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజకీయ పార్టీలతో పాటుగా పలు ఉద్యోగ సంఘాలు ఉద్యోగ జేఏసీని.. అందులోనూ టీఎన్జీఓ, టీజీఓలను టార్గెట్ చేసినట్లు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ జేఏసీ చెంచాగిరి చేస్తుందంటూ బీజేపీ, కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ సంఘాలను ప్రధాన దోషిగా చూపించేందుకు ప్రయత్నాలు చేశాయి. కానీ ఇటీవల కొన్ని పరిణామాలు మారాయి.

జేఏసీ ధైర్యంగా…

ఉద్యోగ జేఏసీ ఫిట్‌మెంట్‌పై ధైర్యంగానే ఉంటోంది. తమకు ఇంకా తలుపులు మూసుకుపోలేదని, సీఎం దగ్గర తేల్చుకుంటామని, కచ్చితంగా 30 శాతం వరకు వస్తుందనే నమ్మకంతో ఉంది. వాస్తవంగా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా అదే వస్తోంది. బిస్వాల్ కమిషన్‌ను దోషిగా చూపిస్తూ సీఎం కేసీఆర్​రాజకీయ నిర్ణయం తీసుకుంటారని, ఉద్యోగ సంఘాలతో చర్చించి ఫిట్‌మెంట్ ప్రకటిస్తారని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. దీంతో 30 శాతం ఫిట్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నారు.

ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు తమ క్రెడిట్‌గా చూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగ జేఏసీలోని సంఘాలైనా, ఇతర సంఘాలైనా తమ ద్వారానే ఫిట్‌మెంట్ వస్తోందని చెప్పుకుంటోంది. ఉద్యోగ సంఘాల్లో పెద్దదైన టీఎన్జీఓ ప్రతిసారిలాగే ఈసారి కూడా తమ ద్వారానే ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్, బెనిఫిట్స్​సాధ్యమవుతాయని, లక్షల మంది ఉన్న సంఘం వినతులను ప్రాధాన్యతగా తీసుకుంటారని చెప్పుకుంటోంది. అటు టీజీఓ కూడా అంతే. గెజిటెడ్ అధికారుల సంఘం మాత్రమే కాకుండా… ఈ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్​గౌడ్​కేబినెట్‌లో ఉండటంతో తమదే క్రెడిట్ అంటోంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే పాట అందుకుంటున్నాయి.

ధిక్కారంతోనే ఐక్యవేదిక

ఈ నేపథ్యంలో ఉద్యోగ ఐక్యవేదిక మాత్రం పోరాటం ధిక్కార స్వరాలనే ఎంచుకుంటోంది. నిరసనలకు దిగుతోంది. సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రభుత్వంపై మండిపడుతోంది. దాదాపుగా 79 సంఘాలతో ఐక్య వేదిక ఉందని, ఐక్య వేదిక డిమాండ్లను పరిశీలించాలని, సీఎస్​ చర్చలకు పిలువాలని ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది. కానీ ఐక్య వేదికను చర్చలకు ఆహ్వానించడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఐక్యవేదికలో ఉన్నాయి. అయితే పీఆర్సీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ జేఏసీ మాత్రం వినతులు, స్నేహపూర్వక హెచ్చరికలు చేసింది. సీఎస్‌ను కలిసి ఫిట్‌మెంట్‌పై చర్చించింది. తొలుతగా టీఎన్జీఓ చర్చలకు వెళ్లి సీఎంతో తేల్చుకుంటామనే ప్రకటన చేసింది. ఆ తర్వాత టీజీఓ కూడా అదే బాటలోకి వచ్చింది. కానీ ఐక్యవేదిక మాత్రం నిరసనలకు దిగింది. సచివాలయం ముట్టడించేందుకు ప్రయత్నించింది. పీఆర్సీ ప్రతులను దగ్ధం చేసింది.

ఎవరి వారివే ఆశలు

ఇక ఉద్యోగ వర్గాలు ఫిట్‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. కనీసం 40 శాతం వరకైనా ఫిట్‌మెంట్ రావాలని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ఇదే సమయంలో పదవీ విరమణ పెంపును కూడా కమిషన్ సూచించడంతో.. ఈ నెలలో పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు, అధికారులు త్వరగా జీవో వస్తే బాగుండని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో కూడా అదే చెబుతున్నారు. “ ఫిట్‌మెంట్ ఇవ్వాళ కాకుంటే రేపైనా వస్తుంది.. మేమైతే ఈ నెలాఖరుతో దిగిపోతున్నాం. ముందు రిటైర్మెంట్ ఏజ్ పెంపు జీవో ఇవ్వమనండి” అంటూ ఉద్యోగ సంఘాల నేతలను కోరుతోంది.

ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, రోజువారీ వేతన ఉద్యోగులు తమకు వేతనాలు పెరుగుతాయనే సంతోషంలో ఉంటున్నారు. ఎందుకంటే కమిషన్​ వారి వేతనాలను పెంచాలని సూచించింది. ఇప్పటి వరకు రూ.12 వేలతో పని చేస్తున్న వారికి రూ.19 వేలు, రూ.15 వేలతో ఉన్న వారికి రూ.22 వేలకు పెంచాలని, కనీసం వేతనం కూడా రూ.19 వేలుగా సూచించింది. దీంతో ముందుగా మా వేతనాలైతే పెంచివ్వండి అంటూ ఉద్యోగ నేతలను వేడుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడా అదే వినతి. ఈ పీఆర్సీ వస్తే తమకు కూడా వర్తింపచేస్తారనే ఆశతో ఉన్నారు. అందుకే మా సంగతి కూడా చూడాలంటూ ఉద్యోగ నేతలకు విన్నవిస్తున్నారు.

Next Story

Most Viewed