బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టే.. ఎన్నిక‌ల త‌ర్వాత ఎన్డీఎతో బీఆర్ఎస్ పొత్తు : సీఎం రేవంత్ రెడ్డి

by Disha Web Desk 23 |
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్క‌టే.. ఎన్నిక‌ల త‌ర్వాత ఎన్డీఎతో బీఆర్ఎస్ పొత్తు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టారంటూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌, బీజేపీలు వేర్వేరు కాద‌ని, రెండు పార్టీల విధానం, ల‌క్ష్యం ఒక్కటేన‌ని అన్నారు.మాకు 12 సీట్లు ఇవ్వండి కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, మ‌ళ్లీ నామా నాగేశ్వ‌ర్‌రావు కేంద్ర‌మంత్రి అవుతాడంటూ ఖ‌మ్మంలో జ‌రిగిన ప్ర‌చారంలో కేసీఆర్ మాట్లాడ‌డాన్ని గుర్తించాల‌న్నారు. బీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య గూడు పుఠాణి జ‌రిగిపోయింది. చీక‌టి ఒప్పందం ఖాయ‌మైంద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు. అందుకే కేసీఆర్‌ వ‌రంగ‌ల్ బీఆర్ ఎస్‌ ఎంపీ అభ్య‌ర్థిగా ఓ అనామ‌కుడిని పెట్టాడ‌ని అన్నారు. కేసీఆర్‌కు శిష్యుడిగా ఉన్న భూ క‌బ్జాకోరు..భూ అన‌కొండ‌ను బీజేపీలోకి తీసుకెళ్లి అభ్య‌ర్థిగా నిల‌బెట్టిండ‌ని అన్నారు. అరూరి ర‌మేష్‌ను బీజేపీలోకి పంపి... బీఆర్ ఎస్ త‌రుపున ఓ అమాయ‌కుడిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టి.. బీజేపీని ఈ స్థానం నుంచి గెలిపించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు వేర్వేరు కాదు.. రెండు ఒక్క‌టే.. ప్ర‌జ‌ల ముందు మాత్ర‌మే ఈ రెండు పార్టీలు వేర్వేరుగా న‌టిస్తున్నాయి. ఈ రెండు పార్టీల విధానం. ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డ‌మేని అన్నారు.

ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు మురిగిపోతుంద‌న్నారు. బీఆర్ ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల ఆత్మ‌గౌర‌వాన్ని కేసీఆర్ బీజేపీకి తాక‌ట్టుపెట్టాడని అన్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా రేగొండ మండ‌ల‌కేంద్ర శివారులో జ‌రిగిన కాంగ్రెస్ జ‌న‌జాత‌ర స‌భ‌కు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా రేవంత్‌రెడ్డి బీజేపీ పార్టీని, న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షా, కేసీఆర్‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కారు క‌రాబైంద‌ని కేసీఆర్ కొడుకే చెబుతున్నాడు.. రాష్ట్రంలో ఇక కారు పార్టీ ప‌నైపోయింది..అందుకే కేసీఆర్ బ‌స్సులో తిరుగుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. బ‌స్సు యాత్ర చూశారా..! తిక్క‌లోడు తిరునాళ్ల‌కు వెళ్లిన చందంగా ఆయ‌న చూసింది లేదు.. చేసిందేం లేద‌న్న‌ట్లుగా యాత్ర సాగుతోందన్నారు. ప‌దేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌.. తెలంగాణ ఉద్య‌మ సిద్ధాంత క‌ర్త జ‌య‌శంక‌ర్ సార్ పుట్టిన గ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల్లోనే ఆ ప‌ని పూర్తి చేసిన విష‌యాన్ని ప్ర‌జ‌లు గుర్తించాల‌ని అన్నారు. తెలంగాణ‌పై కాంగ్రెస్ పార్టీ చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తుంద‌ని అన్నారు. ప‌దేళ్లు కాంగ్రెస్ పార్టీని కార్య‌క‌ర్త‌లు కాపాడారు. కేసీఆర్‌ను బండ‌కేసి కొట్టి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చార‌ని అన్నారు. ఈ రోజు కేసీఆర్ స‌చ్చిన పాములాంటోడు.. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర‌ప్ర‌జ‌లు ప‌డిగే మీద కొట్ట‌కుండా..న‌డుము మీద‌, తోక మీద కొట్టిన‌ట్లు చేసిన్రు.. అందుకే మ‌ళ్లీ ప‌డిగే విప్పుతున్నాడని అన్నారు.

చూసుకుందాం..! బీజేపీ నేత‌ల‌కు రేవంత్ స‌వాల్‌

ఈ ఎన్నిక‌లు తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి, గుజ‌రాత్ పెత్తందారుల‌కు మ‌ధ్య జ‌రుగుతోంద‌ని అన్నారు. గ‌తంలో కేసీఆర్ చేసిన‌ట్లుగానే.. తాను ప్ర‌శ్నిస్తున్నందుకు, ప్ర‌జాస్వామ్య‌యుతంగా మాట్లాడుతున్నందుకు ఇప్పుడు గుజ‌రాత్ వాళ్లు త‌న‌ను జైళ్లో పెట్టాల‌ని చూస్తున్నార‌ని న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షాల‌ను ఉద్దేశించి అన్నారు. రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దును అడ్డుకుంటాన‌ని తాను ప్ర‌క‌టించినందుకే త‌న‌పై అమిత్ షా క‌క్షగ‌ట్టిన‌ట్లుంద‌న్నారు. అచ్చం మాజీముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆత్మ అమిత్‌షాను ఆవ‌హించిన‌ట్లుంద‌ని ఎద్దేవా చేశారు. అందులో భాగంగానే త‌నపై ఢిల్లీలో కేసు న‌మోద‌య్యేలా చేశారని అన్నారు. ఢిల్లీ నుంచి పోలీసుల‌ను గాంధీ భ‌వ‌న్‌కు పంపిచార‌ని అన్నారు. గుజ‌రాత్ పెత్తందారులు, ఢిల్లీ సుల్తానుల‌కు భ‌య‌ప‌డేది లేదు. ప్ర‌జ‌లంద‌రూ త‌న‌కు అండ‌గా. వారంద‌రిని బండ‌కేసి కొట్టుడేన‌ని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎన్న‌డైనా కేసుల‌కు భ‌య‌ప‌డ్డడా అంటూ ప్ర‌జ‌లనుద్దేశించి అన్నారు. చంద్రశేఖ‌ర్‌రావు కూడా ఇలానే త‌మాషా చేసిండు క‌దా..చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు పంపించిండుక‌దా.! చివ‌రికి ఏమైంది..?! కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొట్టిన దెబ్బ‌కు ఇరిగి బోర్ల‌ప‌డ్డ‌డంటూ ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీ, సీబీఐల‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని నిలువ‌రించాల‌ని బీజేపీ నేత‌లు అనుకుంటున్నార‌ని, రేవంత్ రెడ్డిని భ‌య‌పెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసుల‌ను పంపించాల‌ని భావిస్తున్నార‌ని అన్నారు. అందుకే నేను బీజేపీ నాయ‌క‌లుకు స‌వాల్ విసురుతున్నాను. చూసుకుందాం.. గుజ‌రాత్ పెత్త‌న‌మా ? మా తెలంగాణ పౌరుష‌మా? అంటూ అన్నారు.

తెలంగాణ పౌరుషం ఎవ‌రి ముందు త‌ల‌వంచ‌దు.. నిజాంను పోలిమేర‌ల వ‌ర‌కు త‌రిమిన చ‌రిత్ర ఈ నేల‌కు ఉంది. న‌వాబుల లాగుల్లో తొండ‌లుజొప్పించి కొట్టినం.. ఈ ప్రాంతాన్ని విముక్తిని చేసినమ‌ని అన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ సాధ‌న‌కు స‌మైక్యంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న రాష్ట్రానికి పీడ‌గా, చీడ‌గా ప‌ట్టిన కేసీఆర్‌ను మ‌నం వ‌దిలించుకున్నామ‌ని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేదు.. ఢిల్లీ పోలీసుల‌ను కాదు.. స‌రిహ‌ద్దులో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో బిడ్డా.. ఎట్ల‌స్త‌రో చూస్తామ‌ని అన్నారు. దేశంలో జ‌రుగుతున్న దురాగాత‌ల‌కు, అన్యాయాల‌కు క‌లిసి పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీతో సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. ఇప్పుడు జ‌రుగుతున్న ఫైన‌ల్స్‌లో రాష్ట్ర‌, దేశ ప్ర‌జ‌లు గెల‌వాలి.. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగా నిల‌బ‌డాలంటూ పిలుపునిచ్చారు.

బీజేపీ వ‌స్తే రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు..!

బీజేపీ వాళ్లు నాలుగు వంద‌ల ఎంపీ సీట్లు ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు, నాలుగు వంద‌ల సీట్లు ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చ‌డానికంట‌.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను ర‌ద్దు చేయ‌డానికంట‌.. రిజ‌ర్వేష‌న్లను తొల‌గించ‌డానికంట‌.. వారికి అధికారం ఇస్తే ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను, రిజ‌ర్వేష‌న్లు మార్చే కుట్ర జ‌రుగుతోంద‌ని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమ‌లు చేసే ప్ర‌య‌త్నాలు ఆరంభిస్తోంద‌ని అన్నారు. గ‌తంలో రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా బీజేపీ పోరాటాలు చేసింద‌ని, మండ‌ల్ క‌మిష‌న్‌కు వ్య‌తిరేకంగా క‌మండ‌ల్ నినాదంతో ఆ నాడు బీజేపీ నేత అధ్వానీ ర‌థ‌యాత్ర చేప‌ట్టారంటూ గుర్తు చేశారు. బీజేపీ మొద‌ట్నుంచి రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంద‌న్నారు. ఈ దేశంలో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, ఎస్సీ, బీసీ, ఓబీసీ వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు తెచ్చి.. వారిని డాక్ట‌ర్లుగా, ఇంజ‌నీర్లుగా, ఉన్న‌తాధికారులుగా, ప్ర‌జాప్ర‌తినిధులు, మంత్రులుగా, కేంద్ర‌మంత్రులుగా ఇలా సమాజంలో భిన్న వ‌ర్గాల‌ను ఉన్న‌తిలోకి తెచ్చిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ద‌క్కింది.ఈ దేశ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ రిజ‌ర్వేష‌న్ హ‌క్కుల‌ను సాధించి పెట్టింది. డాక్ట‌ర్ బాబా సాహేబ్ అంబేద్క‌ర్ స‌హా ఎంతో మంది మేధావులు త‌మ మాన‌సిక శ్ర‌మ‌తో, దూర దృష్టితో పేద ప్ర‌జ‌లు , అట్ట‌డుగు ప్ర‌జ‌ల అభివృద్ధికి రిజర్వేష‌న్లను అమ‌లు చేశార‌ని అన్నారు. దాని ఫ‌లిత‌మే.. ఇప్పుడు త‌న కేబినేట్‌లో ఉన్న సోదరి సీత‌క్క మంత్రి అయ్యార‌ని, ఎంపీ అభ్య‌ర్థి కావ్య‌వ డాక్ట‌ర్ గా ఎదిగారంటూ చెప్పుకొచ్చారు. రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీకి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

రిజ‌ర్వేష‌న్ల పెంపున‌కు కాంగ్రెస్ ప్ర‌య‌త్నం..

రిజ‌ర్వేష‌న్ల‌ను 50శాతానికి మించి అమ‌లు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీ జ‌నాభాను గ‌ణ‌న చేసి..రిజ‌ర్వేష‌న్లను పెంచాల‌ని భావిస్తోంద‌ని అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా స‌క‌ల జ‌నుల అభిప్రాయాలు తెలుసుకుని బీసీ జ‌నాభాను లెక్కించేందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించారు. తెలంగాణ‌లోనూ అది జ‌రుగుతోందని అన్నారు. బీసీ జ‌నాభాను లెక్కించేందుకు అధికారంలోకి వ‌చ్చ‌ని వెంట‌నే ఆశాఖ‌మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు. బీసీల జ‌నాభాకు అనుగుణంగా రాష్ట్రంలో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసేందుకు.. నిధులు కేటాయింపు చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.

ఒక‌ ప‌క్క బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూంటే.. మాకు నాలుగు వంద‌లు సీట్లు ఇవ్వండి మేం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా, కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌, అర‌వింద్ వ‌ర‌కు చెబుతున్నారని అన్నారు. పదేళ్లు కేసీఆర్ చేతుల్లో బందీ అయిన తెలంగాణ‌ను విముక్తి చేయ‌డంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల కృషియే కార‌ణ‌మంటూ రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇందిర‌మ్మ పాల‌న రావ‌డానికి ప‌దేళ్లు ఎన్నో కేసుల‌కు, అన్యాయాల‌కు ఓర్చుకుని పోరాటం చేశార‌ని అన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డంతోనే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల బాధ్య‌త తీర‌లేద‌ని అన్నారు. ఇప్పుడే ఫైన‌ల్ ఆట ఆడుతున్నామ‌ని అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్ర‌ధాన‌మంత్రిని చేయాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌న్నారు. దేశంలో ప్ర‌జాస్వామ్య శ‌క్తులు బ్ర‌త‌కాలి.. రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావాలంటే బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, ఎస్సీ,బీసీ, మ‌హిళ‌లు, మైనార్టీలు అంతా ఏక‌మై బీజేపీని ఓడించాల‌ని, లేదంటే దేశంలో రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తార‌ని అన్నారు.

Next Story

Most Viewed