హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. ఓటమి తప్పదా.?

by  |
KCr
X

దిశ, తెలంగాణ బ్యూరో : ’దళితబంధు’ పథకంతో ఆ వర్గం ప్రజల మనసు గెల్చుకోవాలని భావించిన సీఎం కేసీఆర్‌కు బీసీల నుంచి వేడి తగులుతున్నది. అర్హులైన వెనకబడిన తరగతుల కుటుంబాలకు కూడా తలా రూ. 10 లక్షల చొప్పున దళితబంధు తరహాలో పథకాన్ని ప్రకటించాలని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి పథకం తేకపోయినా, ప్రకటించకపోయినా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించడంతోనే క్షేత్రస్థాయి ప్రచారానికి ప్లాన్ చేసుకుంటామని స్పష్టం చేశాయి. ఆరు నూరైనా గెలవాలనుకుంటున్న కేసీఆర్‌కు బీసీ సంఘాల నుంచి, ఆ సెక్షన్ ప్రజల నుంచి ఊహించని షాక్ తగిలింది.

బీసీల సంక్షేమం కోసం గతంలో ప్రకటించిన హామీలు అమలులోకి రాలేదని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా రెండు రోజుల పాటు అసెంబ్లీ కమిటీ హాలులో చర్చించినా ఇప్పటికీ కాగితాలకే పరిమితమైపోయాయని ఆ సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు. బీసీ కులాలకు సంక్షేమ కార్పొరేషన్లు, ఆత్మగౌరవ భవన్‌లు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయని పేర్కొన్నాయి. ఎంబీసీ కార్పొరేషన్‌కు ఏటా బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినా అమలు మాత్రం అటకెక్కిందని గుర్తుచేశాయి. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీ ప్రజలను ప్రభుత్వం విస్మరించడం సమంజసంకాదని, కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూలు ప్రకటించేలోపు ‘ బీసీ బంధు‘పై నిర్ణయం తీసుకోవాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికపై డైరెక్ట్ ఎఫెక్ట్?

ప్రభుత్వం ప్రకటించిన ‘దళితబంధు‘ స్కీమ్‌తో అధికార టీఆర్ఎస్‌కు అనుకూల అంశాలతో పాటు ప్రతికూల పరిణామాలు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలోని బీసీ ఓటర్లలో చర్చ మొదలైంది. వాసాలమర్రిలో సభ పెట్టి దళితబంధును ప్రారంభించిన తర్వాత అక్కడి బీసీ ఓటర్లలో కూడా రియాక్షన్లు మొదలయ్యయి. బహిరంగంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించడంలేదు. కానీ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలను పట్టించుకోవడంలేదన్న అసంతృప్తిని అవకాశం వచ్చినప్పుడు చేతల్లో చూపిస్తామని వ్యాఖ్యానిస్తున్నారు.

హుజూరాబాద్‌లో వేర్వేరు కులాలకు చెందిన బీసీ ఓటర్లలో కూడా ఆలోచన మొదలైంది. దళితబంధు పథకాన్ని వ్యతిరేకించకపోయినప్పటికీ అది కేవలం ఈ ఉప ఎన్నిక కోసమే ఉనికిలోకి వచ్చిందని బలంగా అభిప్రాయపడుతున్నారు. దళితబంధును తెచ్చిన కారణంగా హుజూరాబాద్ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తున్నా అక్కడి బీసీ ఓటర్లు మాత్రం భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. దీనిని మరింత వేడెక్కించేలా బీసీ సంఘాలు కూడా ప్లాన్ చేస్తున్నాయి. బీసీ బంధు ప్రకటించకపోతే టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు బంద్ పెట్టాలన్న నినాదంతో ప్రజల్లో ప్రచారం చేయనున్నట్లు బీసీ సంఘాల నేతలు ప్రకటించారు.

‘బీసీ బంధు‘ ఇవ్వకుంటే పాఠం నేర్పుతాం : ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

“తెలంగాణ సమాజంలో సగానికి పైగా జనాభా బీసీలే. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో 2017 డిసెంబరు 3,4 తేదీల్లో బీసీ ప్రజాప్రతినిధులతో అనేక అంశాలు, సమస్యలపై విస్తృతంగా చర్చించారు. పది తీర్మానాలను కూడా చేశారు. కానీ ఒక్కటీ నెరవేరలేదు. బీసీ కార్పొరేషన్లు, బీసీ కమిషన్, సంక్షేమ భవన్‌లు, ఆత్మగౌరవ భవన్‌లు, ఎంబీసీ నిధుల వినియోగం.. వీటి పురోగతి అంతంతే. బీసీల్లోనూ చాలా మంది పేదలు ఉన్నారు. వారి సాధికారత, ఆర్థికాభివృద్ధిపై సీఎంకు పట్టింపు లేదు. దళితబంధు పేరుతో కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నట్లుగానే బీసీలకు కూడా అలాంటి పథకాన్ని తీసుకురావాలి. లేదంటే హుజూరాబాద్‌లో జనం మధ్య తిరిగి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. ఓడించేలా ఉద్యమిస్తాం“.

దళితబంధు పేరుతో దగా : జాజుల శ్రీనివాసగౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

“దళితబంధు పేరుతో ఆ సెక్షన్ ప్రజలను సీఎం దగా చేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే ఈ పథకాన్ని పెడుతున్నామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. బంగారు తెలంగాణ లక్ష్యమా? లేక ఓట్లు, సీట్ల కోసమే రాజకీయం చేస్తున్నారా? మెజారిటీ ప్రజలను అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదా? ఒకవైపు దళిత మహిళలు లాకప్‌ డెత్‌కు గురవుతున్నారు. అరెస్టు అవుతున్నారు. గిరిజనులు, ఆదివాసులు అత్యంత పేదరికంలో ఉన్నారు. దివ్యాంగులు, సంచారజాతులు, ఎంబీసీలు ఉన్నారు.

వారికి కూడా పేదరికం ఉన్నది. అడుగున ఉన్న వీరిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు హుజూరాబాద్‌‌లో ఒడినా గెలిచినా టీఆర్ఎస్‌కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం రాష్ట్రాన్ని, ప్రజలను, సమాజాన్ని ఎందుకు తప్పుదోవ పట్టించాలి? రాష్ట్రం మొత్తాన్ని దత్తత తీసుకుని బాగు చేయాలని ప్రజలు బాధ్యత అప్పజెప్పారు. అన్ని గ్రామాలూ ఆయనకు వాసాలమర్రిగానే ఉండాలి. బీసీలకు చేసిన మోసాన్ని హుజూరాబాద్‌లో ప్రచారం చేసి ఎండగడతాం”.

ఇవీ కూడా చదవండి:

రేవంత్‌కు షాకిచ్చిన సీనియర్లు.. సభకు డుమ్మా

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్.. టీఆర్ఎస్‌లో అంతర్మథనం


Next Story

Most Viewed