కేటీఆర్ సీఎం.. మరి కేసీఆర్ ఏం చేస్తారు?

242

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్‌కు సీఎం కుర్చీ అప్పజెప్పడం దాదాపుగా ఖాయమంటున్నాయి పార్టీవర్గాలు. ఆ తరువాత కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్దికాలం ఫామ్ హౌజ్‎లో విశ్రాంతి తీసుకుంటారని సన్నిహితుల సమాచారం. అనంతరం జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ప్రాంతీయ పార్టీల కూటమి తరహాలో ఫెడరల్ ఫ్రంట్ ఉండకపోవచ్చని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటారా లేక వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగతారా అనే విషయంలో ఇప్పటికింకా స్పష్టత లేదు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత నుంచి కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా పని చేస్తారని సమాచారం. జాతీయ రాజకీయాల మీద ఏ విధంగా ఫోకస్ పెడతారో అనే అంశం మీద అప్పుడే క్లారిటీ వస్తుంది. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని వీలైనంత తొందరగా నిర్మించి అక్కడి నుంచే జాతీయ రాజకీయాల పరిస్థితులకు తగినట్లుగా ఏ వైఖరి తీసుకోవాలన్నదానిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. పరిపాలనా వ్యవహారాలన్నింటినీ కేటీఆర్‌కు అప్పజెప్పి రాజకీయ వ్యవహారాలకు మాత్రమే కేసీఆర్ పరిమితం కావాలనుకుంటున్నారు. అవసరమైతే ఎప్పటికప్పుడు కేటీఆర్‌కు తగిన గైడెన్స్ ఇచ్చేందుకు రాష్ట్రంలో అడ్వయిజరీ కౌన్సిల్ ఉనికిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైన ఈ వ్యవస్థ ద్వారా కౌన్సిల్ ఛైర్మన్‌గా కేసీఆర్ కేటీఆర్‌ను గైడ్ చేయవచ్చని సమాచారం. పూర్తిగా రాజకీయాలపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నందున పార్టీలో సంస్థాగతమైన మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది.

కొంత కాలం విశ్రాంతి

దాదాపు ఆరున్నరేళ్లుగా అటు పార్టీ, ఇటు ప్రభుత్వ వ్యవహారాలలో బిజీగా గడిపిన కేసీఆర్ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఉండలేకపోవడం, వృద్ధాప్య సమస్యలు, ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురికావడంలాంటి కారణాలతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూనే కేటీఆర్ సీఎంగా నిలదొక్కుకునేందుకు అవసరమైనంత కాలం సలహాలిస్తూ రాష్ట్రంలోనే ఉండనున్నారని అంటున్నారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని సమాచారం. అప్పటికి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా సిద్ధమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో తొలుత ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్ అంచనాలకు భిన్నంగా బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో ఆ అంశాన్ని పక్కకు పెట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల సందర్భంగా రైతులతో కలిసి పోరాడనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ‘భారత్ బంద్’లో ప్రత్యక్షంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులంతా డిసెంబరు ఎనిమిదిన రోడ్డెక్కాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం అని, రైతుల పక్షాన్నే ఉంటామని, చట్టాలుగా మారడానికి ముందు పార్లమెంటులో బిల్లులపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.

అనంతరం మారిన వైఖరి

ఆ తర్వాత ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోడీతో, హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి వ్యవసాయ చట్టాల విషయంలో మౌనంగానే ఉన్నారు. చట్టాలకు అనుకూలంగా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి విమర్శలు చేయలేదు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలలో భాగంగా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ ఇకపైన మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారా లేక వ్యతిరేకంగా యుద్ధం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

జమిలి ఎన్నికలతో ముందు చూపు

జమిలి ఎన్నికలు రావచ్చన్న రాజకీయ అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో విజయావకాశాలపై టీఆర్ఎస్‌లో చర్చలు మొదలయ్యాయి. జమిలి ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న తరహాలో కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన తరుణమని కేసీఆర్ భావించినట్లున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు అనివార్యమైతే కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పజెప్పడం జాప్యం కావచ్చని, అవకాశం ఉండకపోవచ్చన్న ఉద్దేశంతో ఇప్పుడే తొందరపడాల్సి వచ్చిందని పార్టీ వర్గాల అభిప్రాయం.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు, జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం నేపథ్యంలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరపడంపైనా, ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పర్చుకోవడంపైనా కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పట్ల ఎలాంటి వైఖరి అవలంబించాలనేదానిపై ఆలోచనలు చేయనున్నట్లు తెలిసింది. వ్యవసాయ చట్టాలతో బీజేపీ పట్ల ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలలో కొంత వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల సమయానికి అది ఏ రూపం తీసుకుంటుందో ఆలోచించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు బీజేపీతో దోస్తీ, దుష్మనీ లాంటి అంశాల జోలికి పోకపోవచ్చని సమాచారం.

రాష్ట్రంలో మళ్లీ సెంటిమెంట్ వ్యూహం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన సమయంలో ఉన్న సెంటిమెంట్‌ తరహాలోనే ఇప్పుడు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సరికొత్త వ్యూహంతో టీఆర్ఎస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే సుమారు 60 లక్షల సభ్యత్వం ఉన్నట్లు పార్టీ చెప్పుకుంటున్నా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తదనంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సందర్భానుసారం మళ్ళీ ప్రజలను కలవడం, వారితోనే కలిసి భోంచేయడం, పల్లెనిద్ర లాంటివాటికి శ్రీకారం చుట్టడం లాంటివన్నీ ఆయన మదిలో ఉన్నట్లు సన్నిహితుల సమాచారం.

ఇటీవలి కాలంలో పార్టీతో అంటీ ముట్టనట్లు ఉన్న సీనియర్ నేతలందరినీ మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుకానున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు గ్రామాలలోకి దూసుకుపోతున్న సమయంలో ఆ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అవసరమైన అన్ని వ్యూహాలపైనా కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. వివిధ స్థాయిల పార్టీ నాయకులు, కార్యకర్తలను కనీసం ఒక్కసారైనా స్వయంగా కలిసి మళ్లీ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చే వ్యూహం అమలు కానుంది. బీజేపీ మందిర్, మతం అంశాలకు దీటుగా పటిష్ట వ్యూహాన్నే అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. మళ్లీ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడం, 2018 నాటి ప్రజాదరణతోనే అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ పార్టీ వ్యహారాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రజలలో ఆదరణ ఉన్న నేతలకు కూడా పార్టీలో బాధ్యతలు అప్పజెప్పి వారి సహకారాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశాలూ ఉన్నాయి.

కేసీఆర్‌కు సెపరేట్ టీమ్

పార్టీని బలంగా తీర్చిదిద్దే టాస్కును కేసీఆర్ తీసుకుంటున్నందున తనకంటూ ఒక టీమ్‌ను కూడా తయారుచేసుకుంటారన్న వార్తలు పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. వయసురీత్యా తరచూ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండకపోవచ్చన్న కారణాన్ని ప్రస్తావిస్తున్న ఆ నేతలు కేసీఆర్ ఆదేశాలను సంపూర్ణంగా అర్థం చేసుకుని ఫుల్‌ఫిల్ చేసే నేతలను ఆ టీమ్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పార్టీలోకి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ లాంటి కీలక బాధ్యతల్లోకి కొత్తవారిని నియమించుకోవచ్చని సమాచారం. దేశంలో ఎక్కడా లేనంతటి వినూత్న సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నా దుబ్బాకలాంటి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఓడిపోవడం కేసీఆర్‌ను బాగా ఇబ్బంది పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇకపైన రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి ప్రతికూల ఫలితాలు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలన్న ఉద్దేశంతో తన టీమ్ ద్వారా పార్టీని పటిష్టంగా ఉంచడంపై దృష్టి పెట్టనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..