బెంగళూరులో ‘జాంబీ డ్రగ్’ కలకలం.. యువకుడి అరెస్ట్.. అసలేం జరిగింది?

by Ramesh Naini |   (  Updated:2026-04-10 13:08:00  IST  )

నగరంలో ఒక వ్యక్తి ‘జాంబీ డ్రగ్’ మత్తులో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఎలాంటి నిజం లేదని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.

బెంగళూరులో ‘జాంబీ డ్రగ్’ కలకలం.. యువకుడి అరెస్ట్.. అసలేం జరిగింది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో ఒక వ్యక్తి ‘జాంబీ డ్రగ్’ (zombie drug) మత్తులో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఎలాంటి నిజం లేదని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించిన 29 ఏళ్ల యువకుడిని బాగలూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన యువకుడిని విద్యారణ్యపురకు చెందిన హేమంత్ కుమార్ (29)గా గుర్తించారు. ఇతను ఒక ప్రసిద్ధ ఐవేర్ (కళ్లద్దాల) బ్రాండ్‌లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

అసలేం జరిగింది?

ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బాగలూర్ మెయిన్ రోడ్డులో వెళ్తున్న హేమంత్.. ఒక వ్యక్తి నడవడానికి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించాడు. ఒక ప్రైవేటు కళాశాల సమీపంలో ఆ వ్యక్తి వింతగా, అదుపుతప్పినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అతను ‘జాంబీ డ్రగ్’ లేదా ‘జైలాజిన్’ (xylazine) తీసుకున్నాడని అనుమానించిన హేమంత్, 32 సెకన్ల వీడియోను రికార్డ్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కొద్దిసేపటికే విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, పలువురు సెలబ్రిటీలు సైతం దీన్ని షేర్ చేశారు.

పోలీసుల దర్యాప్తు - డ్రగ్ వాడకం అవాస్తవం

వీడియో వైరల్ కావడంతో వెంటనే అప్రమత్తమైన బాగలూర్ పోలీసులు.. వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని శరీరంలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని, డ్రగ్స్ వాడకం పూర్తిగా అవాస్తవమని వైద్య నివేదికలు స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్ తీసిన వీడియోలో అతని స్కూటర్ కూడా రికార్డ్ అయ్యింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడిని ట్రేస్ చేశారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న హేమంత్ సోషల్ మీడియాలో క్షమాపణలు కూడా పోస్ట్ చేశాడు. విచారణకు హాజరుకావాలని పోలీసులు శుక్రవారం నోటీసులు ఇవ్వగా, అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హేమంత్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. తాను యూట్యూబ్‌లో అమెరికా, రష్యా దేశాలకు చెందిన కొందరు ‘జాంబీ డ్రగ్’ వాడిన వీడియోలు చూశానని, ఈ వ్యక్తి కూడా అలాగే ప్రవర్తించడంతో పొరబడి వీడియో పెట్టానని అంగీకరించాడు.

తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేయడం, ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం తదితర నేరాల కింద భారతీయ న్యాయ సంహిత (BNS-2023)లోని సెక్షన్ 353(2) మరియు సెక్షన్ 352 కింద హేమంత్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన నేపథ్యంలో బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారాన్ని, వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు.

బీహార్‌లోనూ జాంబీ డ్రగ్ కలకలం!

బీహార్‌లోనూ ‘జాంబీ డ్రగ్’ ప్రచారం జరుగుతోంది. గంటల తరబడి నిలబడి పోయిన ఓ యువకుడి వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీహార్ పోలీసులు స్పందించాల్సి ఉంది.

Next Story