ప్రపంచానికి యోగా భారత్ ఇచ్చిన కానుక.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-21 02:16:10  IST  )

కోల్‌కతా వేదికగా జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పీఎం నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచానికి యోగా భారత్ ఇచ్చిన కానుక.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఏకం చేస్తుందని, మెరుగైన భవిష్యత్తు కోసం మానవతా దృక్పథం ఎంతో అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) అన్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’ అనే స్పెషల్ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మైదానంలో హాజరైన వేలాది మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు.

ఆ శక్తి యోగాకు ఉంది..

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం కొన్ని శారీరక వ్యాయామాల కలయిక మాత్రమే కాదని, అది మానవ ఆత్మ యొక్క అత్యున్నత అభివ్యక్తి అని ప్రధాని కొనియాడారు. అది మనసుకు, శరీరానికి మధ్య సమతుల్యతను చేకూరుస్తుందని తెలిపారు. జాతి, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ అనుసంధానించే అద్భుతమైన శక్తి యోగాకు ఉందని ప్రధాని పేర్కొన్నారు. విశ్వశాంతికి, మానవాళి సంక్షేమానికి ఇది ఒక వారధిలా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. ఈ ఏడాది థీమ్ అయిన ఆరోగ్యకరమైన వృద్ధాప్యం (Healthy Aging) గురించి చెబుతూ.. మారుతున్న జీవనశైలిలో వయసు పైబడిన వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి యోగా ఎంతో దోహదపడుతుందని వివరించారు. భారతదేశ సంస్కృతిలో భాగమైన యోగాను నేడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి తీసుకురావడం మనందరికీ గర్వకారణమని ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.

Next Story