Air India Crash: రతన్ టాటా ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవారా? యూఎస్ లాయర్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-08-11 05:39:11  IST  )

ఎయిరిండియా ప్రమాదం పరిహారం విషయంలో యూఎస్ లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Air India Crash: రతన్ టాటా ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవారా? యూఎస్ లాయర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ లో (Ahmedabad) జూన్ 12న జరిగిన ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతూనే ఉంది. 260 మందికిపైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇంకా అందలేదు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి అందిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. అయితే ఆ పరిహారం ఇంకా అందకపోవడం పట్ల తాజాగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో 65 బాధిత కుటుంబాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూఎస్ న్యాయవాది మైక్ ఆండ్రూస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్యానించారు. పరిహారం విషయంలో రతన్ టాటా ఇలా జాప్యం జరగనిచ్చే వారు కాదని, ఇతరుల పట్ల కరుణతో ఉండే ఆయన బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుర్తించేవారని ఆండ్రూస్ అభిప్రాయపడ్డారు.

అమెరికాలో కూడా రతన్ టాటా ఎవరో మాకు తెలుసు. ఆయన పనితీరు, వినయం, ఉద్యోగుల పట్ల ఆయన తీసుకునే జాగ్రత్తల గురించి కొంచెం తెలుసు. అందుకే ఆయన ఇవాళ బ్రతికి ఉంటే పరిహారం విషయంలో బాధితులు ఎదుర్కొంటున్న క్షోభను తొలగించేవారని అన్నారు. ఈ ఘటనలో తన బాగోగులు చూసుకునే ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఓ తల్లి ఇప్పుడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఇలా ఇతర బాధితులు సైతం ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. కాగా ఈ విమాన ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాల సంక్షేమం కోసం ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూప్ 'ది AI-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్' ను స్థాపించింది. మరణించిన ప్రతి వ్యక్తికి రూ. 1 కోటి ఎక్స్ గ్రేషియా చెల్లింపును ట్రస్ట్ హామీ ఇచ్చింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి మద్దతు ఇస్తామని తెలిపిది. కానీ పరిహారంలో జాప్యం జరుగుతుండటం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

Next Story