West Bengal: సీబీఐ తీరుపైపై కోల్ కతా ఆర్జీకర్ డాక్టర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

by Shamantha N |

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ఆర్జీ కర్‌ (R G Kar Medical College and Hospital) ప్రభుత్వ హాస్పిటల్ హత్యాచార ఘటనపై తీర్పు వెలువడనుంది.

West Bengal: సీబీఐ తీరుపైపై కోల్ కతా ఆర్జీకర్ డాక్టర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లోని ఆర్జీ కర్‌ (R G Kar Medical College and Hospital) ప్రభుత్వ హాస్పిటల్ హత్యాచార ఘటనపై తీర్పు వెలువడనుంది. ఇలాంటి టైంలో మృతురాలి తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో జరిగే విచారణకు సీబీఐ తమని పిలవలేదని పేర్కొన్నారు. తమ లాయర్‌ కూడా కోర్టుకు వెళ్లొద్దని చెప్పినట్లు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన నాటినుంచి సీబీఐ అధికారులు ఒకటి, రెండుసార్లు మాత్రమే తమ ఇంటికి వచ్చారన్నారు. విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నిస్తే.. జరుగుతోందని మాత్రమే చెప్తున్నారని అన్నారు. తమకు ఎలాంటి వివరాలు తమకు తెలియజేయట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా స్వాబ్‌ సేకరించలేదని.. కేసు ఛేదించడానికి సీబీఐ ఎక్కువగా ప్రయత్నించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా డీఎన్‌ఏ రిపోర్టులో వెల్లడైందని అధికారులు పేర్కొన్నారని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

నిందితులకు శిక్షపడినప్పుడే..

నిందితులకు శిక్ష పడినప్పుడు తమకు కొంత ఉపశమనం కలుగుతుందని మృతురాలి తండ్రి తెలిపారు. “మాకు న్యాయం జరిగే వరకు, మేం కోర్టుని ఆశ్రయిస్తూనే ఉంటా. ప్రజల మద్దతును కూడా కోరుతాము. ఈ విషయంలో సీబీఐ ఏమీ చేయలేదు. ఇక్కడ సంతృప్తి చెందే ప్రశ్నే లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు మేం అనేక ప్రశ్నలు లేవనెత్తాము. కోర్టు నుండే సమాధానాలు కోరాం. సీబీఐ నుండి సమాధానాలు కోరలేదు. వారు చెప్పలేదు. కానీ, కోర్టు అన్ని బాధ్యతలను సీబీఐకి అప్పగించింది" అని పీజీ విద్యార్థిని తండ్రి అన్నారు. రెండు నెలల్లో, కోర్టు అన్ని ఆధారాలను సమీక్షించిందన్నారు. ఏ శిక్ష సముచితమో కోర్టు నిర్ణయిస్తుందన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి, న్యాయమంత్రికి లేఖలు రాశామని.. కానీ ఎవరి నుంచి సమాధానం రాలేదన్నారు. ఇకపోతే, కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసుపై శనివారం తుదితీర్పు వెలువడనుంది.

Next Story