ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ ఎందుకు తొందరపడ్డారు?

by Phanindra |

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ ఎందుకు తొందరపడ్డారు? అనే ప్రశ్నకు శాటిలైట్ ఫొటోలు సమాధానం ఇస్తున్నాయి. ఇరాన్ ప్లాన్ చూసిన తర్వాతనే ట్రంప్ నిర్ణయం మారింది.

ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్ ఎందుకు తొందరపడ్డారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని అణుస్థావరాలపై యూఎస్ చేసిన దాడులు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో యూఎస్ జోక్యం చేసుకుంటుందా? అనే ప్రశ్నకు శుక్రవారం నాడు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ.. ‘ఈ విషయంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. ఆ మాట అన్న రెండ్రోజుల్లోనే ఇరాన్‌లోని మూడు కీలక న్యూక్లియర్ సైట్లపై యూఎస్ దాడులు చేసింది. ఇలా అగ్రరాజ్యం ఎందుకు తొందరపడింది? అని చాలామందికి అనుమానాలు వచ్చాయి. దీనికి తాజాగా లభించిన శాటిలైట్ ఫొటోలతో సమాధానం దొరికిందనే చెప్పొచ్చు. యూఎస్ దాడి చేసే అవకాశం ఉందని తెలిసిన తర్వాత ఇరాన్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.


ఈ క్రమంలోనే కీలకమైన ఫోర్దో న్యూక్లియర్ సైట్ నుంచి యురేనియంను భారీ స్థాయిలో తరలించేసినట్లు తెలుస్తోంది. జూన్ 19, 20 తేదీల్లో తీసిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఈ న్యూక్లియర్ సైట్ వద్ద భారీ సంఖ్యలో కార్గో ట్రక్స్ కనిపించాయి. జూన్ 19న సుమారు 16 కార్గో ట్రక్స్ ఈ సైట్ ఎంట్రన్స్ దగ్గర కనిపించాయి. ఆ మరుసటి రోజు ఈ ట్రక్కులు న్యూక్లియర్ ప్లాంట్‌కు సుమారు ఒక కిలోమీటరు దూరంలో పార్క్ చేసి ఉన్నాయి. అదే సమయంలో బుల్డోజర్లు, మరికొన్ని ట్రక్కులు టన్నెల్ ఎంట్రన్స్ దగ్గర కనిపించాయి. ఇజ్రాయెల్ దాడులు మొదలైన తర్వాత దాదాపు ప్రతిరోజూ శాటిలైట్ ఫొటోలను నిపుణులు పరిశీలించారు. అయితే ఆ రోజుల్లో ఎప్పుడూ ఈ స్థాయిలో ఫోర్దో న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ట్రక్స్ కనిపించలేదు.






ఈ ఫోర్దో ఫెసిలిటీలో 83.7 శాతం శుద్ధిచేసిన యురేనియాన్ని ఇరాన్ నిల్వచేసినట్లు సమాచారం. అదే 90 శాతం శుద్ధిచేస్తే.. ఆ యురేనియంతో అణుబాంబులు తయారు చేయొచ్చు. ఈ యురేనియాన్ని మరో చోటకు ఇరాన్ మార్చేస్తే.. ఆ తర్వాత అణుబాంబులు తయారుచేయడం పెద్ద కష్టం కాదనే ఆందోళనతోనే యూఎస్.. ఎక్కువ టైం తీసుకోకుండా దాడులు చేసిందని నిపుణుల అభిప్రాయం.

Next Story