Tahawwur rana:ఎవరీ తహవూర్ రాణా?.. 26/11 బ్లాస్టింగ్ లో మాస్టర్ మైండ్ ను యూఎస్ ఎందుకు అప్పగించట్లేదు?

by Prasad Jukanti |   (  Updated:2025-04-10 11:43:57  IST  )

ముంబయి బ్లాస్టింగ్ కేసులో ఎట్టకేలకు తహవూరు రాణాను భారత్ కు తీసుకురాగలిగారు.

Tahawwur rana:ఎవరీ తహవూర్ రాణా?.. 26/11 బ్లాస్టింగ్ లో మాస్టర్ మైండ్ ను యూఎస్ ఎందుకు అప్పగించట్లేదు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : మారణహోమం సృష్టించిన 2008, 26/11 ముంబయి పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణాను భారత ప్రభుత్వం ఎట్టకేలకు దేశానికి తీసుకువచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయి ఇన్నాళ్లు అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవించిన రాణాను నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం అమెరికా నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో విమానం ల్యాండ్ అయింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అతడిని కోర్టులో ప్రవేశపెట్టి తిహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా తహవూర్ రాణాను భారత్‌కు రప్పించిన నేపథ్యంలో ఇంతకు ఎవరీ తహవూర్ రాణా? అతడికి ముంబయి పేలుళ్లకు ఏం సంబంధం? ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

పాక్ సైన్యంలో కెప్టెన్‌గా..

పాకిస్తాన్ మూలాలు ఉన్న కెనడా పౌరుడు తహవూర్ రాణా 1961లో పాకిస్థాన్‌లోని చిచావత్నీలో జన్మించాడు. బిజినెస్ మేన్‌గా చికాగోలో సెటిల్ అయిన అతడు అంతకుముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో కెప్టెన్‌గా పని చేశాడు. ఆ తర్వాత 1997లో కెనడాకు వలస వెళ్లాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్‌లోని ఆ సంస్థ కార్యాలయంలోనే ముంబై పేలుళ్లకు లష్కరే తోయిబా ఉగ్రవాది, 26/11 కుట్రకు మాస్టర్ మైండ్ డేవిడ్ హెడ్లీకి ఆశ్రయం కల్పించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. హెడ్లీతో రాణాకు అంతకుముందే పరిచయం ఉంది. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. హెడ్లీకి రాణా సహకరించినట్లు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. ముంబయి దాడికి ముందు హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించిన సమయంలో అతడికి రాణా సహకరించాడని అధికారులు చెబుతున్నారు. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా సహకారంతోపాటు ఈ దాడుల బ్లూ ప్రింట్ అంతా రాణా వద్ద ఉండగా రెక్కీ సమయంలో ఇద్దరు 231 సార్లు మాట్లాడుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొన్నది.

యూఎస్‌లో అరెస్ట్..

2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్లు సైతం మరణించారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించడంతో అతడిపై కేసులు నమోదు అయ్యాయి. దాడి జరిగిన ఏడాది తర్వాత 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు యూఎస్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత రాణాను తమకు అప్పగించాలని భారత్ చాలాకాలంగా కోరుతూ వస్తోంది.

హెడ్లీ సాక్ష్యంతోనే...

హెడ్లీ చేపట్టే మిషన్‌కు రాణా చురుకుగా మద్దతు ఇచ్చాడు. 2006-2008 మధ్య హెడ్లీ భారతదేశంలో పలుసార్లు పర్యటించేలా సౌకర్యాలతోపాటు నిధులను రాణా కల్పించాడు. అయితే 2009లో భారత్, డెన్మార్క్‌లలో దాడులకు కుట్ర పన్నినందుకు హెడ్లీని అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు యూఎస్ పోలీసులకు అఫ్రూవర్‌గా మారి ఈ దాడుల్లో రాణా పాత్ర గురించి కీలక విషయాలు వెల్లడించాడు. లష్కరే తోయిబా కార్యకలాపాల గురించి రాణాకు తెలియడమే కాకుండా, ముంబైలో నిఘా కోసం ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో తనకు మద్దతు ఇచ్చాడని విచారణ సమయంలో హెడ్లీ తన వాగ్మూలంలో పేర్కొన్నాడు. భారత్‌లో నిఘా పెట్టాలని రాణాకు లష్కరే తోయిబా ఆదేశాలు ఇచ్చిందని, ఈ దాడుల కోసం రెక్కీ నిర్వహించేలా తాను భారత్‌లో పర్యటించేందుకు అవసరమైన వీసా పత్రాలను తన సిబ్బంది ద్వారా రాణా ఇప్పించారని తెలిపాడు. రెక్కీ సమయంలో అతడు తనతో అనేకసార్లు మాట్లాడాడని వెల్లడించాడు. హెడ్లీ వెల్లడించిన ఈ అంశాలే ఇప్పుడు కీలకంగా మారాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో యూఎస్ తనను భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు రాణా అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నాడు. భారత జైళ్లలో తనను చిత్రహింసలకు గురిచేస్తారని, అది హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానానికి విరుద్ధం అంటూ రాణా పలు ఫెడరల్ కోర్టులతో పాటు అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ అన్నిచోట్ల అతడికి చుక్కెదురైంది. అతడికి అన్ని దారులు మూసుకుపోవడంతో ఆయనను భారత్‌కు రప్పించడానికి మార్గం సుగమమైంది.

ఏం జరగబోతుంది?..

26/11 దాడులలో పాకిస్తాన్ ప్రభుత్వ పాత్ర, ప్రణాళికతోపాటు నిధులు ఎవరు సమకూర్చారు? అనే కీలకమైన విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే భారతదేశంతో పాటు విదేశాలలో రాణాకు చెందిన సహచరుల సమాచారంతో కేసులో కీలక నిందితుల వివరాలు సేకరించే చాన్స్ ఉంది.

హెడ్లీ అప్పగింత లేనట్టేనా?..

తహవూర్ రాణాను అప్పగించిన అమెరికా కేసులో మాస్టర్ మైండ్‌గా ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని మాత్రం అప్పగించేందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు కొన్ని చట్ట, దౌత్య, వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. హెడ్లీ 2010లో యూఎస్‌కు అప్రూవర్‌గా మారాడు. ఆ సమయంలో తనను భారత్, పాకిస్తాన్, డెన్మార్క్‌లకు అప్పగించవద్దని యూఎస్ అధికారులతో హెడ్లీ ఒప్పందం చేసుకున్నాడని, అది చట్టపరమైన ఒప్పందం కావడం వల్ల అతడిని భారత్‌కు అప్పగించడం సాధ్యం కాదని తెలుస్తోంది.

Next Story