ప్రభాకరన్ బతికే ఉన్నారా.. సంచలన రేపుతోన్న నెడుమారన్ కామెంట్స్..?

by Disha Web Desk 19 |
ప్రభాకరన్ బతికే ఉన్నారా.. సంచలన రేపుతోన్న నెడుమారన్ కామెంట్స్..?
X

చెన్నయ్: శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం, వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన 'లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం'(ఎల్టీటీఈ) వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ అలియస్ పెద్దపులి బతికే ఉన్నారా? 2009 మే 18న ముళ్లివైకల్‌లో శ్రీలంక ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌లో చనిపోలేదా? అంటే, 'చనిపోలేదు' అనే సమాధానమే వినిపిస్తోంది. ఇది చెబుతోంది ఎవరో అల్లాటప్ప వ్యక్తి కాదు. 'ప్రపంచ తమిళుల సమాఖ్య' అధ్యక్షుడు నెడుమారన్‌నే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ప్రభాకరన్ చనిపోయినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించి దాదాపు 14ఏళ్లు గడిచిన తర్వాత, ఆయన ప్రాణాలతోనే ఉన్నారని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించడం గమనార్హం.

ఈ మేరకు నెడుమారన్ తమిళనాడు పట్టణం తంజావూరులో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాడు. తమిళ ఈలం కోసం తన వ్యూహాలనూ ప్రకటిస్తాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని వెల్లడించారు. ప్రభాకరన్ బతికున్నారన్న వార్తను ఇప్పుడే ప్రపంచానికి చెప్పడానికి గల కారణాలనూ నెడిమారన్ వివరించారు. 'శ్రీలంకలో సింహళ తిరుగుబాటు తర్వాత రాజపక్సే ప్రభుత్వం పతనం కావటంతో అనుకూలమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి, ప్రభాకరన్ ప్రజల ముందుకు రావడానికి ఇదే సరైన సమయం' అని తెలిపారు. అయితే, ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు? సరిగ్గా ఎప్పుడు వస్తారు? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఎవరీ పెద్దపులి?

ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని జాఫ్నాకు సమీప ప్రాంతంలో జన్మించారు. బ్రిటిష్ పాలకులు రగిల్చిన జాతి వైషమ్యాలు.. వారు దేశాన్ని విడిచివెళ్లిన తర్వాత కూడా కొనసాగాయి. దీంతో తమిళ జాతీయవాదం తలెత్తింది. ఈ క్రమంలోనే ప్రభాకరన్ 1976లో ఎల్టీటీఈ స్థాపించారు. సింహళుల ఆధిపత్య శ్రీలంక ప్రభుత్వం, సింహళ పౌరులు తమపై విపక్ష చూపుతున్నారంటూ తమిళులకు స్వయంప్రతిపత్తి కోసం ఎల్టీటీఈ పిలుపునిచ్చింది. దేశంలో తమిళ మైనార్టీలకు ఉత్తర శ్రీలంకలో స్వతంత్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పోరాటం చేశారు.

అది క్రమంగా అది గెరిల్లా పోరాటంగా మారింది. 1983లో జాఫ్నా వెలుపల శ్రీలంక సైన్యం పెట్రోలింగ్‌‍పై గెరిల్లా దాడి జరగడంతో 13మంది సైనికులు మరణించారు. దీంతో ఎల్టీటీఈని శ్రీలంక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇది అంతర్యుద్ధంగా మారడంతో 90వ దశకంలో శ్రీలంక సింహళీయులకు, మైనార్టీ తమిళులకు మధ్య భీకర పోరాటం సాగింది. విదేశాల నుంచి అందేసాయం, తమిళుల సంపూర్ణ మద్దతుతో ప్రభాకరణ్‌కు సొంతంగా ఒక సైన్యమే ఉండేది. దీంతో దాదాపు 26ఏళ్లపాటు సింహళిల ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారు.

వేలాది మంది ఊచకోత

2006లో ప్రభుత్వానికి, ఎల్టీటీఈకి మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో కొరకరాని కొయ్యగా మారిన ఎల్టీటీఈని అంతమొందించేందుకు మహింద రాజపక్స నేతృత్వంలోని లంక సైన్యం 2009లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అంతమొందించింది. ఆసాంతం ఇరు వర్గాలకు మధ్య జరిగిన ఈ సుదీర్ఘ పోరులో 28వేల మంది తమిళ గెరిల్లాలు, 24వేల మందిపైగా లంక సైనికులు, పోలీసులు, 40-50వేల మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 2009 జనవరి నుంచి మే మధ్యలోనే 5వేల మంది టైగర్లు, 40వేల మంది తమిళ ప్రజలు ఊచకోతకు గురయ్యారు.

ఇందులో భాగంగానే, 2009 మే 18న ముళ్లివైకల్‌ జిల్లాలో ప్రభాకరన్‌ను చంపినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మృతదేహం ఫొటోలు, వీడియోలనూ విడుదల చేసింది. అతని మృతదేహాన్ని సన్నిహితులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతకన్నా ముందు రోజు మరణించిన అతని కొడుకు డీఎన్ఏతో ప్రభాకరన్ డీఎన్ఏ పోలినట్టు వెల్లడించాయి. దీంతో శ్రీలంకలో అంతర్యుద్ధం అనధికారికంగా ముగిసినట్టయింది. కానీ, ఇన్నాళ్లకు మళ్లీ ప్రభాకరన్ బతికే ఉన్నారని నెడుమారన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎలాంటి సాక్ష్యాలూ లేవు: శ్రీలంక ఆర్మీ

ప్రభాకరన్ బతికే ఉన్నాడన్న నెడుమారన్ వ్యాఖ్యలపై శ్రీలంక సైన్యం స్పందించింది. ప్రభాకరన్ బతికే ఉన్నాడనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని వెల్లడించింది. శ్రీలంక ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ మాట్లాడుతూ, ప్రభాకరన్ చనిపోయినట్లు నిరూపించడానికి శ్రీలంకలో 'డిఎన్‌ఎ సర్టిఫికేట్లు' సహా అన్ని రికార్డులూ ఉన్నాయని చెప్పారు. 'మా రికార్డుల ప్రకారం, మీరు సూచించిన వ్యక్తి జీవించి ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. కాబట్టి, రాజకీయ నాయకుడు చేసిన ఈ ప్రత్యేక ప్రకటన గురించి మీరు అతన్నే అడగాలి' అని తెలిపారు. మరోవైపు, నివేదికలను పరిశీలించిన తర్వాత దీనిపై స్పందిస్తామని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ చెప్పారు.

ప్రభాకరణ్‌ను చూపిస్తే వెళ్లి కలుస్తా: కాంగ్రెస్ సెటైర్లు

ప్రభాకరన్ బతికి ఉన్నాడనే వ్యాఖ్యలపై కాంగ్రెస్ వ్యంగ్యంగా స్పందించింది. తాను వెళ్లి ప్రభాకరణ్‌ను కలుస్తానని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అలగిరి అన్నారు. ప్రభాకరన్‌ను నెడుమారన్ చూపిస్తే తాను వెళ్లి కలుస్తానని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed