- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బళ్లారిలో అసలేం జరుగుతోంది? మరో రాయలసీమ కాబోతుందా?
కర్ణాటకలోని బళ్లారి అల్లర్లకు రాజకీయ ఈగోలే కారణమా?

దిశ, వెబ్ డెస్క్ : దేశం అంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగిపోయి ఉంటే.. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేపాయి. జనవరి 1న ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల మధ్య బ్యానర్ల విషయంలో జరిగిన గొడవ చివరికి పోలీసుల, లాఠీఛార్జీ, కాల్పులు.. ఒకరి మరణం వరకూ వెళ్ళింది. దీంతో ప్రశాంతంగా ఉన్న బళ్లారి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం పట్టణంలో సెక్షన్ 144 అమలులో ఉంది. ఇంతకీ అక్కడ ఏమైందంటే..?
గొడవకు దారి తీసిన అంశాలివే..
జనవరి 3న మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చెందిన బ్యానర్లను బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు నగరవ్యాప్తంగా ఏర్పాటు చేయడం ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి నివాసం సమీపంలోని అవంభావి ప్రాంతంలో బ్యానర్లు పెట్టడంతో, జనార్ధన్ రెడ్డి మద్దతుదారులు వాటిని తొలగించారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలై, క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది. ఒక వర్గంపై మరొక వర్గం రాళ్లు రువ్వడం, బీరు సీసాలతో పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జీ, అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి అనే 26 ఏళ్ల యువకుడు బుల్లెట్ గాయాలతో మృతి చెందాడు.
మరోవైపు, గంగావతి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ఇంటిముందు కట్టిన బ్యానర్ పడిపోతే.. క్షమాపణలు చెప్పామని, మళ్ళీ కడతామని చెప్పినా కాంగ్రెస్ అనుచరులు తన ఇంటిముందు హల్ చల్ చేసి, కాల్పులకు పాల్పడ్డారని అన్నారు. భరత్ రెడ్డి మద్దతుదారులు ముందే ప్లాన్ చేసి పెట్రోల్ బాంబులతో దాడికి వచ్చారని, తన ఇంటిని 40 మంది గుండాలు మోహరించి భయబ్రాంతులకు గురి చేసారని సంచలన ఆరోపణలు చేసారు. ఇక బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాల్మీకి విగ్రహావిష్కరణ ఆపబోమని స్పష్టం చేసారు. యువకులం తాము శాంతియుతంగానే ఉన్నామని, 65 ఏళ్ల వారే అతిగా రెచ్చిపోయి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భరత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుత బళ్లారి పరిస్థితి ఏంటీ?
ప్రస్తుతం బళ్లారి నగరంలో సెక్షన్ 144 అమలులో ఉంది. అదనపు పోలీసు బలగాలను మోహరించి, మళ్ళీ అల్లర్లు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసారు. ఈ ఘటనకు సంబంధించి హత్య, హత్యాయత్నం, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ, హింస కింద నాలుగు కేసులు నమోదు చేయగా, కొందరిని అరెస్ట్ చేశారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య స్పందిస్తూ.. ఆ బుల్లెట్ ప్రయివేట్ గన్ నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. పూర్తి విచారణకు ఆదేశిస్తూ.. ఏడీజీపీని సంఘటన స్థలానికి పంపించారు. ప్రస్తుతం శాంతి నెలకొన్నప్పటికీ, ఉద్రిక్తత మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు.
బాధ్యతారాహిత్య రాజకీయాలు..
పూర్తిగా బాధ్యతారాహిత్య రాజకీయాల ఫలితమే ఈ అల్లర్లు అని, ప్రశాంతంగా ఉన్న బళ్లారి నగరం ఈ ఘటనతో రాయలసీమ ప్రాంతాల్లో గతంలో జరిగిన ఫ్యాక్షన్ గొడవలను తలపించేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యానర్ గురించి జరిగిన అతిచిన్న వివాదం మాటల వరకే ఆగిపోవాల్సి ఉండగా.. అది హింస వరకు.. చివరకి ఒకరి ప్రాణం పోయే స్థాయికి వెళ్లడం చాలా దురదృష్టకరమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇకనైనా ఇరు పార్టీల నాయకులు తమ ఈగోలు, అధికార బల ప్రదర్శనను పక్కనపెట్టి శాంతి, చట్టపరమైన పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో నష్టపోయేది సాధారణ ప్రజలే కాబట్టి, అన్ని పార్టీలు సంయమనం పాటించి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతున్నారు.






