ఏంటీ? సమోసా, జిలేబీ మన దేశం వంటకాలు కాదా? మరీ ఎక్కడివంటే?

by Yella Dhawani Reddy |

భారతీయులు అధికంగా ఇష్టపడే వంటకాల్లో సమోసా, జిలేబీలకు ప్రత్యేక స్థానం ఉంది.

ఏంటీ? సమోసా, జిలేబీ మన దేశం వంటకాలు కాదా? మరీ ఎక్కడివంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయులు అధికంగా ఇష్టపడే వంటకాల్లో సమోసా, జిలేబీలకు ప్రత్యేక స్థానం ఉంది. పండగలు, పార్టీలు, కార్యాలయ టీ బ్రేక్‌లు.. ఇలా సందర్భం ఏదైనా తప్పకుండా ఇవి ఉండాల్సిందే. కానీ ఇటీవల జిలేబీ, సమోసాలపై ఆరోగ్య సంబంధిత హెచ్చరికలు పెట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం ఈ వార్తల్ని కొట్టిపారేసింది. సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే జారీ చేశామని, సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సమోసా, జిలేబీ మూలాలపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. నిజంగా ఇవి భారతీయ వంటకాలేనా? లేక విదేశాల నుంచి వచ్చినవేనా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మధ్య ఆసియాలో పుట్టిన సమోసా

సమోసా అనే పదానికి మూలం సంబుసా. ఇది మధ్య ఆసియా, ముఖ్యంగా అఫ్గానిస్థాన్‌ ప్రాంతంలో మొదటగా తయారైనట్లుగా తెలుస్తోంది. అక్కడ ఈ వంటకాన్ని మాంసంతో నింపి తయారు చేసేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో (13–14వ శతాబ్దం) ఇది భారతదేశానికి చేరింది. భారతీయులు దీనిని తమ రుచులకు అనుగుణంగా మార్చుకొని, మాంసం బదులు బంగాళాదుంపలు, కూరగాయలతో తయారు చేశారు. ఒక నివేదిక ప్రకారం, భారత్‌లో ప్రతి ఏడాది సుమారు 2,100 కోట్ల సమోసాలు అమ్ముడవుతున్నట్లు సమాచారం.

పశ్చిమాసియా నుంచి వచ్చిన జిలేబీ

జిలేబీని చాలా మంది ప్రాచీన భారతీయ మిఠాయిగా అనుకుంటారు. కానీ దీని అసలు మూలాలు పశ్చిమాసియాలో ఉన్నాయి. ఇరాన్‌, అరేబియా ప్రాంతాల్లో దీనిని ‘జిలేబియా’ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఇది భారతదేశానికి పరిచయమైంది. భారతీయులు దీనిని తమస్వంతంగా మార్చుకొని, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శైలిలో తయారు చేయడం ప్రారంభించారు. ఇక భారత్‌లో ఏటా 34 కోట్ల జిలేబీలు అమ్ముడవుతున్నాయట!

Next Story