ఇజ్జత్ పోగొట్టుకున్న పీకే.. రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్.. రాజకీయ వేత్తగా అట్టర్‌ఫ్లాప్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-14 11:41:32  IST  )

అందరి రోగాలను నయం చేసే డాక్టర్.. తన రోగానికి తాను వైద్యం చేసుకోలేడన్న చందంగా తయారైంది రాజకీయ వ్యూహకర్త ....

ఇజ్జత్ పోగొట్టుకున్న పీకే.. రాజకీయ వ్యూహకర్తగా సక్సెస్.. రాజకీయ వేత్తగా  అట్టర్‌ఫ్లాప్
X

దిశ, వెబ్‌డెస్క్: అందరి రోగాలను నయం చేసే డాక్టర్.. తన రోగానికి తాను వైద్యం చేసుకోలేడన్న చందంగా తయారైంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. రెండు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి వారి విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి మూలస్తంభంగా నిలిచారు.

బిహార్ లోని ప్రముఖ కాలేజీలో సైన్స్ స్ట్రీమ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రశాంత్ కిషోర్.. 2005 నుంచి 2011 వరకూ ఐక్యరాజ్యసమితిలో పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా మారి.. తొలి ప్రచారం ప్రధాని నరేంద్రమోదీకే చేశారు. ప్రస్తుత ప్రధాని అయిన నరేంద్రమోదీకి గుజరాత్ లో 3వ సారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహాలను రచించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీని కైవసం చేసుకోవడంలో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే ఎన్నికల ప్రచారాన్ని పరిచయం చేశారు. 2011లోనే ఈ NGO సంస్థను స్థాపించగా.. 2014లో అది ప్రజల్లో గుర్తింపు పొందింది. చాయ్ పే చర్చ, 3డీ ర్యాలీ వంటి ఇన్నోవేటివ్ క్యాంపెయిన్స్ రన్ చేసి.. బీజేపీ విజయానికి రాజమార్గాన్ని వేశారనడంలో అతిశయోక్తి లేదు.

ఆ తర్వాత 2015లో బిహార్ లో JDU+RJD విజయానికి పనిచేశారు. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్, 2019లో ఏపీలో వైసీపీ, 2020లో వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీలకు రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి, పలు క్యాంపెయిన్లు రన్ చేసి.. వారికి విజయాలను అందించారు. కానీ.. జేడీయూలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రశాంత్ కిశోర్.. నితీష్ పై విమర్శలు చేసి 2022లో ఆ పార్టీలో బహిష్కరణకు గురయ్యారు. అప్పుడే ఆయన జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించినప్పటి నుంచి బిహార్ లో ప్రజల మధ్యే ఉన్నారు ప్రశాంత్ కిశోర్. బిహార్ బద్లావ్ పేరుతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. బిహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని, చరిత్రను మార్చేది తామేనని ప్రగల్బాలు పలికారు. రాజకీయ నేపథ్యం, ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేని వారిని ఎన్నికల్లో పరిచయం చేశారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి.. ఆ ఆదాయాన్ని రాష్ట్రం డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. కానీ.. తన స్పీచ్ తో ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

కానీ.. కర్ణుడి చావుకి వందకారణాలు అన్నట్లుగా.. ప్రశాంత్ కిశోర్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉన్నత విద్య, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి, మోదీ లాంటి వారికి విజయాలను అందించిన ఆయనకు తన పార్టీ విజయం సాధించేందుకు ఎలా ప్రచారం చేయాలో, ప్రజల్లోకి ఎలా వెళ్లాలో తెలియకపోవడం గమనార్హం. జన్ సురాజ్ పార్టీలో ఉన్నవారిలో ప్రజలకు బాగా తెలిసిన ఒకే ఒక్క పేరు ప్రశాంత్ కిశోర్. పెద్దగా పేరుమోసిన రాజకీయ నేతలు ఆ పార్టీలో లేకపోవడం బిగ్ మైనస్ అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ చేసిన ప్రచారంలోనూ.. ప్రతీసారి ఒకేరకమైన స్పీచ్ ఉండటం ప్రజలకు బోర్ కొట్టేసిందంటున్నారు. ఈయన మాకేం చేస్తాడన్న ఉద్దేశానికి ప్రజలు వచ్చారని, పైగా పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారే తప్ప ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయకపోవడం కూడా ప్రజలకు నచ్చలేదంటున్నారు. ఒకవేళ ప్రశాంత్ కిశోర్ పోటీ చేసి ఉంటే.. ఆ పార్టీకి కనీసం ఒక్క సీటైనా దక్కి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఏదేమైనా కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీ ఒకటికి రెండుసార్లు ఓటమి పాలైనా.. మూడోసారి విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ అయిన కాన్షీ రామ్ కొన్నేళ్ల క్రితమే.. రాజకీయ అరంగేట్రం చేసేవారికి కోసం మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. తొలి ఎన్నికల్లో ఘోర పరాజయం, రెండో ఎన్నికల్లో ఓటమి కావడం సాధారణమేనని, మూడో ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని సూచించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. ప్రశాంత్ కిశోర్ త్వరలోనే రాజకీయంగా పుంజుకుంటారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Next Story