- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mehbooba Mufti: ఉగ్రదాడిని చూసి కశ్మీరీలు సిగ్గుపడుతున్నారు- ముఫ్తీ
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) స్పందించారు. ఈ ఘటనపై తనత పాటు కశ్మీరీలు సిగ్గుపడుతున్నారని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కశ్మీర్ లోని పౌరులపై జరిగిన అత్యంత హేయమైన దాడుల్లో ఇది ఒకటని అన్నారు. బుధవారం శ్రీనగర్‌లో పీడీపీ కార్యకర్తలతో కలిసి మెహబూబా ముఫ్తీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆతర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ఇది మాపై జరిగిన దాడి. మేం దీనిని ఖండిస్తున్నాం. దీనిని సహించబోం. ఇక్కడ హోంమంత్రి ఉన్నారు. దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను గుర్తించాలి. అప్పుడు వీలైనంత త్వరగా శిక్షించవచ్చు. సరదాగా గడిపేందుకు కశ్మీర్‌కు వచ్చే అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం పిరికిపంద చర్య. ఈ దాడిపై మేం సిగ్గుపడుతున్నాం. కశ్మీరీలు సిగ్గుపడుతున్నారని దేశ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నా. ఈ బాధాకరమైన సమయంలో మీకు అండగా ఉంటాం. నేరస్థులను త్వరగా గుర్తించి శిక్షించాలని కోరుతున్నాం’ అని అన్నారు.
రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు..
కాగా, ఉగ్రదాడి భద్రతా లోపం వల్ల జరిగిందా అన్న ప్రశ్నను ముఫ్తీ దాటవేశారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదన్నారు. ప్రస్తుతం బాధలో ఉన్నామని.. ప్రజలు వేదనతో ఉన్నారన్నారు. జమ్ముకశ్మీర్ సహా దేశం మొత్తం శోకసంద్రంలో ఉందన్నారు. బాధిత కుటుంబాల బాధను అర్థం చేసుకోగలమన్నారు. అంతేకాకుండా, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు, నిరసన ప్రదర్శనలో ‘ఇది ప్రజలపై జరిగిన దాడి. అమాయకులను చంపిన భయానక చర్య. అమాయకుల హత్యలను ఆపండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను కార్యకర్తలు ప్రదర్శించారు.






