Indians Deported From US: కిలోమీటర్లు నడిచి.. మృతదేహాలను దాటుకోని.. భారతీయ అక్రమవలసదారుల హార్ట్‌ టచింగ్‌ స్టోరీ

by Vennela |   (  Updated:2025-02-06 12:18:21  IST  )

Indians Deported From US: అక్రమంగా అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి భారత్ కు వెనక్కి వచ్చిన జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయి.

Indians Deported From US: కిలోమీటర్లు నడిచి.. మృతదేహాలను దాటుకోని.. భారతీయ అక్రమవలసదారుల హార్ట్‌ టచింగ్‌ స్టోరీ
X

దిశ,వెబ్‌డెస్క్: Indians Deported From US: అక్రమంగా అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి భారత్ కు వెనక్కి వచ్చిన జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అమెరికా అని కలలు కంటూ తమ కుటుంబాలకు మంచి జీవితం అందిద్దామని అక్కడికి వెళ్లినవారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

పంజాబ్ కు చెందిన హర్వీందర్ సింగ్ కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదించాలనుకున్నాడు. అమెరికాలో పని వీసా ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ కు రూ. 42లక్షలు కట్టడాడు. తర్వాత వీసా రాలేదని చెప్పి కొందరు మధ్యవర్తుల ద్వారా ఢిల్లీ నుంచి ఖతార్..అక్కడి నుంచి బ్రెజిల్ కు చేరుకున్నాడు. తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తానని చెప్పిన మధ్యవర్తి మళ్లీ మోసగించాడు. ట్యాక్సీలో కొలంబియా, పనామాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామని చెప్పారు. ఆ ఏర్పాటు కూడా లేదు. 2 రోజులు పాటు అక్రమమార్గంలో తరలించిన తర్వాత ఒక చిన్న బోటులో మెక్సికో సరిహద్దుకు తీసుకెళ్లారు. 4గంటల ప్రయాణం తర్వాత బోటు తిరగబడి ఒకరు మరణించారని హర్వీందర్ సింగ్ చెప్పారు. చివరకు డంకీ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టిన హర్వీందర్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కడినుంచి వెళ్లాడో మళ్లీ అక్కడికే చేరుకున్నాడు.

పంజాబ్ లోని దారాపూర్ కు చెందిన సుఖ్ పాల్ సింగ్ కథ చెప్పుకుంటే కన్నీళ్లు వస్తాయి. దాదాపు 15గంటల పాటు సముద్ర ప్రయాణం చేసిన తర్వాత 45కిలోమీటర్లు పర్వత ప్రాంతంలో ప్రయాణించాడు. మధ్యలో జరగరానిది ఏమైనా జరిగితే ఇక అంతే సంగతులు. బతుకుపై ఆశలు వదులుకోలేక తప్పదు. దారి వెంట ఎన్నో శవాలను చూసినట్లు సుఖ్ పాల్ చెప్పారు. మెక్సికో సరిహద్దు దగ్గర తమను అరెస్టు చేసి 14రోజులపాటు చీకటి గదుల్లో బంధించారని తెలిపారు. అక్కడ వేలాది మంది పంజాబీ యువత ఇలాంటి పరిస్థితే ఎదుర్కుంటున్నట్లు చెప్పాడు. అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లటం ఏమాత్రం శ్రేయస్కారం కాదంటున్నాడు.

భారత్ తిరిగి వచ్చిన 104 మంది అక్రమ వలసదారుల్లో జస్పాల్ సింగ్ కూడా ఒకరు. తనను అమెరికాలో పట్టుకున్న తర్వాత చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేసి బంధించినట్లు తెలిపారు. అమృత్‌సర్‌ ఎయిర్ పోర్టుకు వచ్చేంత వరకు అవి అలాగే ఉన్నాయని తెలిపాడు. గురుదాస్ పూర్ కు చెందిన 36ఏళ్ల జస్ పాల్ జనవరి 24న మెక్సికో సరిహద్దు దాటిన వెంటనే అమెరికా పెట్రోలింగ్ పార్టీకి దొరికాడు. 30లక్షలు ఇస్తే అమెరికా పంపిస్తామంటూ మాయమాటలు చెప్పిన ఏజెంట్ మోసం చేసి బ్రెజిల్ గుండా తరలించాడు. 6నెలలు బ్రెజిల్ లోనే ఉండాల్సి వచ్చిందని జస్పాల్ చెప్పాడు. జస్పాల్ ను అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు 11 రోజులు కస్టడీలో ఉంచుకుని ఆ తర్వాత వెనక్కి పంపించారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడి యంత్రాంగం అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియను షురూ చేసింది. భారత్ కు చెందిన 17వేల మందికిపైగా అక్రమంగా అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తొలి విడతలో సైనిక విమానంలో 104 మందిని వెనక్కి పంపించింది. వారిలో గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్ చెందినవారు ఉన్నారు.

Next Story