WB Results: కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. బీజేపీ నేత సువేందు అధికారి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

బెంగాల్ ఫలితాల వేళ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.

WB Results: కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం.. బీజేపీ నేత సువేందు అధికారి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ నేత, సీఎం అభ్యర్థి సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఆయన లక్ష్మీ నారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈసారి మార్పు ఖాయమని, దైవబలం తమకే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను లక్ష్మీ నారాయణ స్వామిని ప్రార్థించానని, దేవుడు తమ వైపు ఉన్నాడని కామెంట్ చేశారు. సనాతన ధర్మ ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వమే బెంగాల్‌లో అధికారంలోకి రాబోతోందని సువేందు పేర్కొన్నారు.

అభిషేక్ బెనర్జీకి కౌంటర్..

ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్‌పై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ చేసిన ట్వీట్‌ను సువేందు తప్పుబట్టారు. ఇది ఆయన అహంకారానికి నిదర్శనమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి సాగవని ఎద్దేవా చేశారు. బెంగాల్‌లోని ప్రస్తుత పరిస్థితిని యూపీ, బిహార్‌లతో పోల్చారు. గతంలో యూపీలో జంగిల్ రాజ్ ఉండేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అది అంతమైందన్నారు. 20 ఏళ్ల క్రితం బిహార్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటే ప్రజలు దానికి ముగింపు పలికారు. ఇప్పుడు బెంగాల్‌లో కూడా అదే పునరావృతం కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story