- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాల్లోనే ఢీకొన్న విమానం, హెలికాప్టర్.. ఎవ్వరూ బతికే ఛాన్స్ లేదు!
విమానం, హెలికాప్టర్ ఎలా ఢీకొన్నాయనే దానిపై ఇప్పటి వరకు కారణాలు తెలియరాలేదు.

- వాషింగ్టన్‌లోని పోటోమాక్ నదిలో కూలిన విమానం
- విమానంలో 64 మంది, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు
- ఎవరూ బతికే అవకాశాలు లేవని చెప్పిన ఫైర్ చీఫ్
- ప్రమాదాన్ని నివారించలేకపోవడంపై ట్రంప్ అసహనం
దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికాలోని వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి దిగుతున్న పీఎస్ఏ ఎయిర్స్‌లైన్ విమానం, రక్షణ శాఖకు చెందిన సికోర్‌స్కి హెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి. ఆ వెంటనే ఈ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానం 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాన్సాస్‌లోని విషిటా విమానాశ్రయం నుంచి వాషింగ్టన్‌కు వస్తోంది. ఇక ఆర్మీ హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. హెలీకాప్టర్‌లో వీఐపీలు, రక్షణ సిబ్బంది ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెస్క్యూ, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఎలా జరిగింది?
విమానం, హెలికాప్టర్ ఎలా ఢీకొన్నాయనే దానిపై ఇప్పటి వరకు కారణాలు తెలియరాలేదు. రీగన్ ఎయిర్‌పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రన్‌వే 33పై ల్యాండ్ చేయడానికి విమానం పైలెట్లకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇచ్చింది. అయితే సరిగ్గా అదే సమయానికి ఓ మిలటరీ హెలికాప్టర్.. విమానం ప్రయాణిస్తున్న మార్గంలోనే ఎదురుగా వచ్చింది. దీంతో మీకు ముందు విమానం వస్తుందని, మీకు కనిపిస్తోందా అంటూ ఏటీసీ నుంచి హెలికాప్టర్ పైలెట్‌కు సమాచారం పంపించారు. కానీ ఆ తర్వాత క్షణాల్లోనే విమానాన్ని హెలికాప్టర్ ఢీకొన్నట్లు ఏటీసీ తెలిపింది. రన్‌వేకు 2400 అడుగుల దూరంలోనే విమానం నుంచి రేడియోట్రాన్స్‌పాండర్ డేటా ఆగిపోయిందని, అప్పుడు విమానం సరిగ్గా నది మధ్యలో ఉన్నట్లు ఏటీసీ అధికారులు తెలిపారు.
ప్రెసిడెంట్ ట్రంప్ అసహనం..
రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన దుర్ఘటనపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయానికి విమానం సరైన దిశలోనే వెళ్తోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయి. అయినా సరే హెలికాప్టర్ చాలా సేపు నేరుగా విమానం వైపు వెళ్లింది. అది కిందకో, మీదకో, పక్కకో ఎందుకు వెళ్లలేదు అని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. మీరు విమానాన్ని చూశారా అని అడిగే బదులు.. కంట్రోల్ రూమ్ సిబ్బంది ఏం చేయాలో ఎందుకు చెప్పలేదు. ఇది పూర్తిగా నివారించదగిన ప్రమాదం అంటూ ఎక్స్ వేదికగా ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు. సహాయక చర్యలు అందుతున్నాయని.. అయితే ఎంత మంది చనిపోయారనే విషయం ఇంకా తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
బతికే అవకాశం లేదు : ఆర్మీ చీఫ్
వాషింగ్టన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 28 మంది మృతదేహాలను నదిలో నుంచి వెలికి తీసినట్లు ఫైర్ చీఫ్ జాన్ డాన్నెలీ తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు గమనిస్తే ఎవరూ బతికే అవకాశాలు కనపడటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మేము రెస్క్యూ ఆపరేషన్ నిలిపేసి.. రికవరీ ఆపరేషన్ మొదలు పెట్టామని.. మృత దేహాల కోసం నది అంతా గాలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మేం కనుగొన్న మృతదేహాల్లో 27 విమాన ప్రయాణికులవి కాగా, ఒకటి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తిదని చెప్పారు.






