- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. రేపు లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక అందజేయనున్న చైర్మన్ పాల్
వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది.

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Jpc) ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది. ప్రతిపాదిత చట్టానికి సవరించిన సంస్కరణలను మెజారిటీ ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ చట్టానికి అనుకూలంగా 16 మంది సభ్యులు ఓటు వేయగా,11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం లభించినట్టు చైర్మన్ జగదాంబిక పాల్ (Jagadhambika paul) తెలిపారు. ఈ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) కు అందజేస్తామని వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డు తన పనిని పారదర్శకంగా, సమర్ధవంతంగా చేసేందుకు దోహదపడుతుందన్నారు. ఈ బిల్లు కింద తొలిసారిగా పస్మండ ముస్లింలు, పేదలు, మహిళలు, అనాథలను వక్ఫ్ లబ్ధిదారుల్లో చేర్చినట్టు చెప్పారు.
అయితే పలువురు ప్రతిపక్ష సభ్యులు దీనిపై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. తుది నివేదికను అధ్యయనం చేసి తమ అభిప్రాయాలను తెలిపేందుకు తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులందరూ ఈ అంశంపై నిరసనలు తెలుపుతారని శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. అలాగే కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఏఐఎంఐఎం వంటి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా బిల్లును తీవ్రంగా విమర్శించారు. 655 పేజీల ముసాయిదా నివేదికను చదవడానికి ఒక్క రాత్రి కూడా సమయం ఇవ్వలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దీనిని పార్లమెంటులోనూ వ్యతిరేకిస్తామని తెలిపారు.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు (Kiran rijiju) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, వాటి నియంత్రణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో గతేడాది ఆగస్టు 8న బిల్లుపై మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి జేపీసీని ఏర్పాటు చేసింది. దీనిపై పలు సమావేశాలు నిర్వహించిన జేపీసీ తాజాగా ఆమోదం తెలిపింది.






