- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: శిక్షణలో దివ్యాంగులైన క్యాడెట్ల గురించి కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు
వివిధ సైనిక సంస్థలలో శిక్షణ పొందుతున్న క్యాడెట్లకు బీమా కవరేజ్ మంజూరు చేసే అవకాశాన్ని కేంద్రం అన్వేషించాలని తెలిపింది

దిశ, నేషనల్ బ్యూరో: శిక్షణ సమయంలో దివ్యాంగులై కోలుకున్న క్యాడెట్లకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాడెట్లు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తమ స్పందన ఏంటో తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు భద్రతా దళాలను సోమవారం కోరింది. శిక్షణ సమయంలో వైకల్యం కారణంగా చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన క్యాడెట్ల ఇబ్బందులపై సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రధానంగా భీమా, వైద్య ఖర్చులు, పునరావాసం వంటి మూడు అంశాలను ప్రస్తావించింది. వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని, డెస్క్ జాబ్ లేదంటే రక్షణ సేవల్లో ఏవైనా విధులకు అవసరమయ్యేలా పథకాన్ని రూపొందించేలా చూడాలని జస్టిస్ బి వి నాగరత్న, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే, వివిధ సైనిక సంస్థలలో కఠినమైన శిక్షణ పొందుతున్న క్యాడెట్లకు బీమా కవరేజ్ మంజూరు చేసే అవకాశాన్ని కేంద్రం అన్వేషించాలని తెలిపింది. క్యాడెట్‌లకు గ్రూప్ బీమా ఉంటే, డిపార్ట్‌మెంట్‌పై కూడా భారం పడదు. అది బీమా సంస్థపై ఉంటుంది. పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంది. ధైర్యవంతులు సైన్యంలోకి రావాలని మేము కోరుకుంటున్నాము. కానీ వారికి తగిన ప్రయోజనాలు ఇవ్వకపోతే నిరుత్సాహపడతారని ధర్మాసనం అభిప్రాయపడింది. క్యాడెట్లకు వైకల్యం లేదా మరణం సంభవిస్తే బీమా రక్షణ కల్పించేలా చూడాలని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని కూడా పెంచాలని సూచించింది. దేశ సైనిక సంస్థలైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ లాంటి సంస్థల్లో శిక్షణ పొందిన క్యాడెట్ల గురించి హైలైట్ చేస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన కథనం ఆధారంగా కోర్టు సుమోటోగా కేసును నమోదు చేసింది. 1985 నుంచి వైద్యపరమైన కారణాలను చూపి 500 మంది క్యాడెట్లను విధుల్లోకి తీసుకోలేదు. వారికి ఇస్తున్న ఎక్స్‌గ్రేషియా(రూ. 40,000) కూడా వైద్య ఖర్చుల కంటే చాలా తక్కువగా ఉంది.






