తమిళనాడులో ‘జల్లికట్టు’ తరహా ఉద్యమం.. గవర్నర్‌‌కు విజయ్ ఫ్యాన్స్‌ సంచలన హెచ్చరిక

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-07 12:03:17  IST  )

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అత్యధిక స్థానాలు సాధించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో ‘జల్లికట్టు’ తరహా ఉద్యమం.. గవర్నర్‌‌కు విజయ్ ఫ్యాన్స్‌ సంచలన హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అత్యధిక స్థానాలు సాధించిన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాజకీయ పార్టీలు, మరోవైపు విజయ్ అభిమానులు గవర్నర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గురువారం మధ్యాహ్నం విజయ్ నివాసం వద్ద ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరిత దృశ్యం కనిపించింది. విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక అభిమాని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలు మార్పును కోరుకుని విజయ్‌కు మద్దతు ఇచ్చారని, కానీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.

జల్లికట్టు తరహా ఉద్యమం వస్తుంది.. జాగ్రత్త!

గవర్నర్ తన తీరు మార్చుకోకపోతే తమిళనాడు మరోసారి ఉగ్రరూపం దాల్చుతుందని విజయ్ అభిమాన సంఘాలు హెచ్చరించాయి. గతంలో జరిగిన ‘జల్లికట్టు’ ఉద్యమం తరహాలో రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్లపైకి వస్తుందని, అప్పుడు పరిస్థితి అదుపు తప్పుతుందని వారు స్పష్టం చేశారు. అటు సోషల్ మీడియాలో కూడా విజయ్‌కు మద్దతుగా వందలాది పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి విజయ్‌కు ఇంకా క్లియరెన్స్ రాలేదు. సొంతంగా మెజారిటీ లేని పక్షంలో, మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 118 మంది సభ్యుల జాబితాను సమర్పించాలని గవర్నర్ పట్టుబడుతున్నట్లు సమాచారం. బలం నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తామని గవర్నర్ స్పష్టం చేయడంతో టీవీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది.

రంగంలోకి కాంగ్రెస్.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు..

మరోవైపు, గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటానికి సిద్ధమైంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గవర్నర్ కేంద్రం చేతిలో పావుగా మారారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు లోక్‌భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. గవర్నర్ నిర్ణయంపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story