ఆసిమ్‌ మునీర్‌ కరుడు కట్టిన ఉగ్రవాది.. సూట్‌లో ఉన్న బిన్ లాడెన్!

by Phanindra |

ఆసిమ్‌ మునీర్‌ కరుడు కట్టిన ఉగ్రవాదని, సూట్‌లో ఉన్న బిన్ లాడెన్ అని పెంటగాన్ మాజీ అధికారి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఆసిమ్‌ మునీర్‌ కరుడు కట్టిన ఉగ్రవాది.. సూట్‌లో ఉన్న బిన్ లాడెన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా గడ్డపై నుంచి న్యూక్లియర్ బెదిరింపులకు దిగిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌‌‌ కరుడు గట్టిన ఉగ్రవాది అని యూఎస్ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రుబిన్ అన్నారు. ఉగ్రవాద దేశంలా పాక్ ప్రవర్తిస్తోందన్న రుబిన్.. మునీర్‌ను ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. యూఎస్‌లో పర్యటించిన మునీర్.. తమపై దాడి చేస్తే సగం ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ అధికారుల ముందే అతను ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఈ ఘటనపై స్పందించిన రుబిన్.. యూఎస్ గడ్డపై నుంచి పాకిస్తాన్ ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉగ్రవాదులకు అణ్వాయుధాలతో ఇష్టమొచ్చినట్లు చేయొచ్చనే సందేశాన్ని పంపుతాయని అభిప్రాయపడ్డారు. ‘ఉగ్రవాదాన్ని అమెరికా బాధితురాలిగానే చూస్తుంది. కానీ టెర్రరిస్టుల సైద్ధాంతిక ఆలోచనలను అర్థం చేసుకోదు. ఆసిమ్ మునీర్ ఒకరకంగా సూట్‌లో ఉన్న ఒసామా బిన్ లాడెన్. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇస్లామిక్ స్టేట్ చేసే బెదిరింపుల్లాగే ఉన్నాయి’ అని రుబిన్ తెలిపారు.

పాకిస్తాన్‌ను ప్రపంచం అంతా కలిసి అదుపు చేయాలని, బలూచిస్తాన్ వంటి ప్రాంతాలను వేరే దేశాలుగా గుర్తించాలని సూచించారు. పాక్ అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైతే మిలిటరీ చర్యలకు కూడా దిగాలని అన్నారు. పాక్‌ను నాటోలో లేని మిత్రదేశంగా గుర్తించడం మానేసి, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా యూఎస్ గుర్తించాలని డిమాండ్ చేశారు. దాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్‌ సభ్యదేశంగా గుర్తించకూడదని తేల్చిచెప్పారు.

ఆసిమ్ మునీర్‌ను ‘పర్సోనా నాన్ గ్రాటా’గా గుర్తించాలని, ఆ దేశం తమ విధానాలపై వివరణ ఇచ్చి, క్షమాపణలు చెప్పే వరకు మునీర్ లేదా ఇతర పాకిస్తానీ అధికారులకు అసలు అమెరికా వీసానే ఇవ్వకూడదని పేర్కొన్నారు.

Next Story